Saturday, July 29, 2023

తొక్కనిచోట్లు దొక్కెడి - Tokkanichotlu Tokkedi

తొక్కనిచోట్లు దొక్కెడిమనసు
యెక్కడ గతిలే దింకనో తెరువు

పాపము వాయదు పై పై మనసున
కోపము దీరదు కొంతైనా
దీపన బాధయుఁ దీర దిన్నియును
యేపునఁ బెనఁగొనె నింకనో తెరువు

యెవ్వనమదమును నెడయదు కోరికె
కొవ్వును నణఁగదు కొంతైనా
రవ్వగు మమకారముఁ బెడఁబాయదు
యెవ్విధియును లేదింకనో తెరువు

వెఱపును విడువదు వెడమాయలఁబడి
కొఱఁతయుఁ దీరదు కొంతైనా
తెఱఁ గొసఁగేటి శ్రీతిరువేంకటపతి -
నెఱిఁగీ నెఱఁగలే మిఁకనో తెరువు


భావము - 
అయ్యో !! నానా విధములైన ఆశలలోనే పొర్లుచూ ,
అన్ని వైపులా దిమ్మరినై తిరుగుతున్నానే , ఆజ్ఞానాంధకారములోనే !
నిజమైన సన్మార్గమేదో నాకు చూపించగల ,
ఆ అందమైన శ్రీ హరిని , తలచుకోకుండా మర్చిపోయానే !
ఇలా కూలబడిపో యానే ! అకటా చాలు ఇక నా ఈ దురవస్థ ! 
శ్రీ హరి పదములే మార్గమని ఆ వైపుకే ఇక పయనిస్తాను !! 
 
అన్నమాచార్యుల వారు అనేక సంకీర్తనలలలో , దేహులు
మనస్సును నియంత్రించుకోలేక , సన్మార్గమేదో తెలుసుకోలేక ,భౌతిక భ్రాంతులలోనే ,సమయమెల్లా గడుపుతున్నారు ,అని తన భావనను వ్యక్తపరిచారు !
సరియైన త్రోవ మనకు శ్రీ వేంకటి పతి శరణాగతి వేడితే బోధపడును అని పరిష్కారము కూడా చెప్పియున్నారు అనేక కీర్తనలలో ! 
అటువంటి చక్కటి సంకీర్తన ఈ వారము అర్ధము తెలుసుకుని పాడుకుందామా ! 

ఈ మనస్సు అనేది , తిరగకూడని చోట్లనెల్లా ఆసక్తి గా తిరుగుతుంది !
ఇది తొక్కని ప్రదేశమంటూ ఏదీ లేదు !
అకటా దీన్ని అదుపు చేసి , సరైన గతిలో పెట్టే దారియే లేదా ?

పాపపు ఆలోచనలు చేయుట మానదే ఈ మనసు ,
అలాగే దాని కోపమును అణచుట కూడా కష్ట సాధ్యమే ! 
ఇక మరి నాకు దారియేది ?
ఏన్ని సంగతులపై ఆకలి యున్నదో ఈ మనసుకు ! 
ఎంత ఇచ్చి దాన్ని తృప్తి పరచదామన్నా ,అది ఇంకా విజృంభించి
పెనవేసుకుపోతోంది కొత్త కొత్త రుచులకు ! ఇక నాకు దారి యేది ?

యౌవ్వనముతో నా మదమత్సరములు , కోరికలను వీడుటలేదు ! 
నాలో అహంకారము అనే కొవ్వు అణుగుటయే లేదు ! 
ఇక ఈ బంధాలూ ,మమకారాలూ ప్రేమలూ కొంచము కూడా నా నుంచీ దూరమవ్వటంలేదు ! 
ఇక యే విధముగానూ నేను సరియైన త్రోవన వెళ్లు మార్గమే కనపడుటలేదే ! 

నాలోని భయాందోళనలు కూడా నన్ను విడుటలేదు , ఈ మాయల ప్రపంచములోనే నన్ను ముంచుతున్నాయి !
ఏమి చేసినా నాకు అందులో కొంత కొరతయే కనపడుతోంది ! 
సంపూర్ణముగా సంతృప్తియే లేదే !
సరియైన త్రోవను చూపెడి శ్రీ వేంకటపతి పై నా మనసు
లగ్నమై ఆతనిని ఆశ్రయించినప్పుడే కదా నాకు సన్మార్గమేదో బోధపడి సంతృప్తి చెందేది !
ఇంతకంటే వేరే చక్కటి మార్గము ఇక ఏమియూ లేదు !
ఇది తెలుసుకున్న తరువాత ఇంకో మార్గమును ఎరుగ వలసిన అవసరమూ లేదు ! 
(భావము Courtesy - Venugopal Yellepeddi garu)


No comments:

Post a Comment