సారెసారె విన్నవించఁ జాలమిఁక నీవు
దారిదప్ప దిరిగేవు తగవా వోరి
దారిదప్ప దిరిగేవు తగవా వోరి
చెప్పరాదు కడు వలచిన వానివలె నా-
కొప్పులోని సవరము కొంటఁబోయి
అప్పుడే వొక్కతికిచ్చితట వోరి నా-
తప్పుగాని నీవల్లఁ దప్పులేదు వోరి
కొప్పులోని సవరము కొంటఁబోయి
అప్పుడే వొక్కతికిచ్చితట వోరి నా-
తప్పుగాని నీవల్లఁ దప్పులేదు వోరి
కడలేని మోహంబు గలవానివలె నా-
కడితాను చీర నీవు కాసెవోసి
వడిగా నేఁగెదవు యవ్వతికియ్యవలెనో నన్ను
వడిఁబెట్టి యింతసేయవలెనా వోరి
కడితాను చీర నీవు కాసెవోసి
వడిగా నేఁగెదవు యవ్వతికియ్యవలెనో నన్ను
వడిఁబెట్టి యింతసేయవలెనా వోరి
ముద్దుల నా వేలనున్న ముద్దుటుంగరము నీవు
వుద్దండానఁ గొంటఁబోతి వోరి
తిద్దలేము నీగుణాలు తిరువేంకటేశ నీవు
వొద్దికతో నన్నుఁబాయకుండరా వోరి
వుద్దండానఁ గొంటఁబోతి వోరి
తిద్దలేము నీగుణాలు తిరువేంకటేశ నీవు
వొద్దికతో నన్నుఁబాయకుండరా వోరి
ఓ స్వామీ! నీకిప్పటికే ఎన్నో సార్లు చెప్పాము. ఇంకా ఎన్నిసార్లని చెపుతామయ్యా! నాపట్ల చాలా తప్పుగా నడచుకుంటున్నావు. ఇది నీకు న్యాయమేనయ్యా! నేనెవరికైనా ఏమని చెప్పుకుంటాను. నాదగ్గరకు వచ్చావు. నన్నే ప్రేమిస్తున్నానన్నావు. నే నేమరుపాటుగా నుండగా నా కొప్పులోని సవరాన్ని తీసుకొని పోయి ఏమీ ఆలస్యం చేయకుండానే ఇంకో ఆమెకిచ్చావని విన్నాను. నిజమేనా. అయినా ఇదంతా నా తప్పేగాని నీతప్పే మాత్రంలేదు. అంతే కదయ్యా!
ఓ స్వామీ! నీవు అంతులేని మోహమున్నవాని లాగానే నటించి- నేను కట్టుకొనే నల్లని చీరను తీసుకొని వెళ్లి కుచ్చెళ్లు పెట్టి మరీతీసుకొని-నేనెక్కడ చూస్తానేమో అనే శంకతో వడివడిగా వెళ్లావు. అంత తొందరగా వెళ్లవలసిన అవసరమిప్పుడు నీకెందుకు కలిగిందయ్యా! ఈ చీరనిప్పు డెవతె కివ్వాలనుకుంటున్నావు. నన్ను కావాలని ఇట్లా చేయటం నీకు తగినదేనా చెప్పవయ్యా!
ఓ స్వామీ! ఎంతో అందంగా నా వ్రేలికమరిన ముద్దుటుంగరాన్ని నాకే మాత్రం చెప్పకుండా అడ్డగోలుగా తీసుకొని వెళుతున్నావు. అది
నీవెవతెకివ్వటానికో తీసుకొని వెళుతున్నావో తెలియకుండా ఉన్నది. ఓ శ్రీ వేంకటేశ్వర స్వామీ! నీవెప్పుడు ఏఏ కార్యాలు నిర్వహిస్తావో నాకేం తెలుస్తుందయ్యా! నీగుణాలను నేను చక్కదిద్దగలనా! దీనికి ఒక్కటే పరిష్కారం. నీవు ఒద్దికతో నన్ను నీ హృదయంలోనుంచుకొని ఏనాటికి విడవకుండా ఉండటమేనయ్యా! ( భావవాణి… డా. మాదిరాజు.)