Friday, March 31, 2023

ఇప్పుడెట్లున్నదో - Ippudetlunnado

ఇప్పుడెట్లున్నదో యిందువదన
అప్పటికిఁ గొంత గుణమాయ నావేళ

తెఱవ శశికాంతవేదికమీఁద మలఁగుపై -
నొఱగి పరితాపాగ్నినుడుకఁ గాను
నెఱి దొలఁకు మోమువెన్నెలకు శశికాంతంపు -
టఱఁగు గరఁగిన శైత్యమాయెనావేళ

చెలియ పొన్నల విడ (నీడ?) చిగురుఁబానుపుమీఁద
పలుమారు నినుదూరి పాడఁగాను
చెలఁగి పొన్నల విరియు చిలుకుఁదేనెల సోనఁ
దెలివొంది కొంత వడదీరెనావేళ

తొయ్యలి విలాసమున తూగు మంచముమీఁద
పయ్యెదరజార నినుఁ బాడఁగాను
తియ్యమునఁ గూడితివి తిరువేంకటేశ్వరుఁడ
నెయ్యంపు వేడుకలు నినిచెనావేళ 


చూడఁచిన్నదాన వింతె - Chuda Chinnadana Vinthe

చూడఁచిన్నదాన వింతె సుద్దులు కోటానఁగోటి
యేడేడ నేరుచుకొంటివే వో కలికి

కిన్నెరమీఁటులలోని గిలిగింతలు । నీ –
వన్నెల కనుచూపుల వలవంతలు
యెన్నరాని యిచ్చకపు టెలయింతలు
యెన్నఁడు నేరుచుకొంటివే నో కలికి

సారెకు నెడవాయని సరసములు । నీ –
తారుకాణ సన్నల తమకములు
గారవించి బుజ్జగించే గమకములు
యేరీతి నేరుచుకొంటివే వో కలికి

కందువ శ్రీవేంకటేశు కలయికలు । నీ –
యందమైన సమరతి యలయికలు
పొందుల మునిముంగిలి పొలయికలు
యెందెందు నేరుచుకొంటివే వో కలికి 


చూడవే గోవింద - Cudave Govinda

చూడవే గోవింద సోద్యము లిన్నియు
యేడాఁ గర్తవు యిన్నిట నాకు

చీరినఁ దునుఁగక చేసిన దురితము
నారవలెనే కడు నారటిలీ
కారుకొని తలఁపు కలఁకగుణంబుల
వారక పెనునదివలెఁ బారీని

యెఱ్ఱఁగాఁ గ్రూరత్వ మెప్పుడుఁ గొలిమిలో
కఱ్ఱువలెనే కడుఁగాఁగీని
వొఱ్ఱియై ప్రకృతి వొరసి వేఁటలో
యిఱ్ఱివలెనే యెలయించీని

వీడక నీమూర్తి వెంటవెంటనే
తోడునీడయై తొరలీని
యీడనే శ్రీవేంకటేశ నీ మహిమ
వాడని వనములవలెఁ జిగిరించీని


వినయాలు సేసేవు - Vinayalu Sesevu

వినయాలు సేసేవు వేంకటేశుఁడ
వెనువెంటఁ బాయక వేంకటేశుఁడ

విరుల వేసే వదేమో వేంకటేశుఁడ
వెరగయ్యీ నీ చేతఁకు వేంకటేశుఁడ
విరివాయ నీసుద్దులు వేంకటేశుఁడ
అరుదుగ వింటిమోయి అన్నీ వేంకటేశుఁడ

వేడుకకాఁడ వౌదువు వేంకటేశుఁడ
వీడుదోడాడేవు మాతో వేంకటేశుఁడ
వీడెపు మోవి నవ్వేవు వేంకటేశుఁడ
జాడలెల్లా గంటిమోయి సారె వేంకటేశుఁడ

వేసాల వాఁడవుగదో వేంకటేశుఁడ
వేసారవు రతులను వేంకటేశుఁడ
వేసేవు నాపైఁ జేయి వేంకటేశుఁడా నన్ను
సేసవెట్టి పెండ్లాడేవు శ్రీవేంకటేశుఁడా 


Sunday, March 19, 2023

కలిగె నిదె నాకు - Kaligenide Naku

కలిగె నిదె నాకు కైవల్యము
తొలుత నెవ్వరికి దొరకనిది

జయ పురుషోత్తమ జయ పీతాంబర
జయ జయ కరుణాజలనిధి
దయ యెఱంగ నే ధర్మము నెఱఁగ నా-
క్రియ యిది నీ దివ్యకీర్తనమే

శరణము గోవింద శరణము కేశవ
శరణు శరణు శ్రీజనార్దన
పరమ మెఱంగను భక్తి యెఱంగను
నిరతము నాగతి నీ దాస్యమే

నమో నారాయణ నమో లక్ష్మీపతి
నమో పుండరీకనయనా
అమిత శ్రీవేంకటాధిప యిదె నా
క్రమమెల్లను నీకయింకర్యమే 


అన్నిసింగారాలకు - Anni Singaralaku

అన్నిసింగారాలకుఁ దా నమరినాఁడు
వన్నెలఁ బొ దొద్దకచాయవాఁ డాయ నితఁడూ

జలజాక్షుఁ డటుగాన జలకమాడేటివేళ
జలజాకరమువలె సరి నున్నాఁడు
చలివాసి సిగ్గులతో జవ్వనులు గొలువఁగ
నిలుచున్నాఁ డదివో నిచ్చలాన నీతఁడు

ఘనశంఖపాణి గాన కప్పురకాపువేళ
తనమేను నిధానమై తగి యున్నాఁడు
మనసిజగరిడిలో మఱి సాము సేసి వచ్చి
అనుఁగుఁ బుప్పొడిఁ దోఁగి యట్టే వున్నా డీతఁడూ

నీలవర్ణు డటు గాన నించినపుళుగువేళ
తాలిచేందుకు భరణి తానై వున్నాఁడు
ఆలరి శ్రీవేంకటేశుఁ డలమేలుమంగమెడ
తాళిగాఁ గట్టుక లోలో దక్కియున్నాఁ డీతఁడూ 


నీవు సామాన్యుఁడవా - Nivu Samanyudava

నీవు సామాన్యుఁడవా నీగుట్టు నే నెఱఁగనా
వావులెంత చెప్పినాను వలచేవా

కలయఁగ నీకుఁ బని గలుగఁగానే కాక
బలిమిసేసితే నీవు పలికేవా
నెలకొన్నతమకము నీకుఁ గలుగఁగాఁ గాక
పిలిపించితే నీవు ప్రియాన వచ్చేవా

చేకొని నీవుల్లాసము సెలవి వెళ్లఁగాఁ గాక
నాకు వలెనంటే నీవు నవ్వేవా
కైకొనఁగా నీకు నాపై కాంక్ష గలుగఁగాఁ గాక
ఆకు నే మడిచియ్యఁగా నందుకొనేవా

యింతటాను నీవు నన్ను యేలుకొనఁగాఁ గాక
మంతన మెంతాడినాను మనసిచ్చేవా
యింతులలో శ్రీవేంకటేశ నన్నేలితివి
పంతము నేనాడితేను పరాకుసేసేవా 


సతితోడ సారెసారెకు - Satitoda Saresareku

సతితోడ సారెసారెకు సరసములాడుకొంటా
తతితోడనారగించీ తగునె యీదేవుఁడు

ఒక్కమాటె వంటలెల్లా నొద్దనుండి వడ్డించి
మిక్కిలినలసె నలమేలుమంగ
చెక్కులఁ జెమటగారఁ జేరి యీపె వడ్డించఁగా
చొక్కి చొక్కి యారగించీఁ జూడరె యీదేవుఁడు

పాఱి పాఱి బంగారుపళ్ళెములు వెట్టించి
మీఱి బుసకొట్టె నలమేలుమంగ
జాఱిన తురుముతోడఁ జవులాకె యడుగఁగ
ఆఱడి గూరలు మెచ్చీనంతలో నీదేవుఁడు

వాలిన రాజసముతో వంటసాలలోననే
మేలిమిఁ గూచున్న దలమేలుమంగ
యీలోనె శ్రీవేంకటేశుఁడీపెఁ దానునారగించి
తాలమిఁ గాఁగిటఁగూడె దక్కక యీదేవుండు 


రామా రామభద్ర - Rama Ramabhadra

రామా రామభద్ర రవివంశరాఘవ
యేమి యరుదిది నీకింతటివానికిని

నాఁడు రావణు తలలు నఱకినలావరివి
నేఁడు నాపాపములు ఖండించరాదా
వాఁడిప్రతాపముతోఁడ వారిధిగట్టిన నాటి-
వాఁడవిట్టె నామనోవార్ధిఁ గట్టరాదా

తనిసి కుంభకర్ణాది దైత్యుల గెలిచితివి
కినిసి నాయింద్రియాల గెలువరాదా
యెనసి హరుని విల్లు యెక్కుపెట్టి వంచితివి
ఘనము నాదుర్గుణము కడు వంచరాదా

సరుస విభీషణుఁడు శరణంటేఁ గాచితివి
గరిమ నే శరణంటిఁ గావరాదా
తొరలి శ్రీవేంకటేశ దొడ్డుగొంచ మెంచనేల
యిరవై లోకహితానకేదైనా నేమీ


యీడగుఁ పెండ్లి యిద్దరిఁ జేసేము - Eedagu Pendli

యీడగుఁ బెండ్లి యిద్దరిఁ జేసేము
చేడెలాల యిది చెప్పరుగా

పచ్చిక బయళ్ళఁ బడఁతి యాడఁగా
ముచ్చటఁ గృష్ణుఁడు మోహించి
వెచ్చపు పూదండ వేసి వచ్చె నట
గచ్చుల నాతనిఁ గానరుగా

ముత్తెపు ముంగిట ముదిత నడవఁగా
వుత్తముఁడే చెలివురముననూ
చిత్తరువు వ్రాసి చెలఁగి వచ్చె నొళ
జొత్తు మాని యిటు చూపరుగా

కొత్త చవికెలోఁ గొమ్మ నిలిచితే
పొత్తునఁ దలఁబాలు వోసెనటా
యిత్తల శ్రీవేంకటేశుఁడు నవ్వుచు
హత్తి సతి గూడె నని పాడరుగా 


విన్నమాఁట కన్నమాఁట - Vinnamata Kannamata

విన్నమాఁట కన్నమాఁట విన్నవించితిమి నీకు
వున్నాఁడవు మాయింట వూహలు నీకెట్టివో

అల్లాడ వారు నిన్ను నడిగిరి యేమిటికో
వెల్లవిరిగాఁ గొందరు వెదకిరి
మొల్లమిఁ గొందరు నీకు మొక్కిరి యందరియిండ్లా
వల్లెగా నేమి సేసి వచ్చితివో

నయములనే కొందరు నవ్విరి నీసుద్దులకు
ప్రియపడి పేర నిన్నుఁ బిలిచిరి
దయతో నినుఁ గొందరు దలఁచిరి యాడనాడ
జయమై చుట్టరికము సరి నెంత గలదో

కొందరు నీరాకలకుఁ గోరి నిక్కిచూచిరి
కందువ నీకూటములే కడుమెచ్చిరి
యిందరిఁ గూడి శ్రీవేంకటేశ నన్నూఁ గూడితివి
సందడిజాణఁడవు నీసరవి చూచితిమి