Sunday, March 19, 2023

విన్నమాఁట కన్నమాఁట - Vinnamata Kannamata

విన్నమాఁట కన్నమాఁట విన్నవించితిమి నీకు
వున్నాఁడవు మాయింట వూహలు నీకెట్టివో

అల్లాడ వారు నిన్ను నడిగిరి యేమిటికో
వెల్లవిరిగాఁ గొందరు వెదకిరి
మొల్లమిఁ గొందరు నీకు మొక్కిరి యందరియిండ్లా
వల్లెగా నేమి సేసి వచ్చితివో

నయములనే కొందరు నవ్విరి నీసుద్దులకు
ప్రియపడి పేర నిన్నుఁ బిలిచిరి
దయతో నినుఁ గొందరు దలఁచిరి యాడనాడ
జయమై చుట్టరికము సరి నెంత గలదో

కొందరు నీరాకలకుఁ గోరి నిక్కిచూచిరి
కందువ నీకూటములే కడుమెచ్చిరి
యిందరిఁ గూడి శ్రీవేంకటేశ నన్నూఁ గూడితివి
సందడిజాణఁడవు నీసరవి చూచితిమి 


No comments:

Post a Comment