Sunday, February 26, 2023

అరుదరుదు నిన్నుఁ బెండ్లాడిన - Arudarudu Ninnu Pendladina

అరుదరుదు నిన్నుఁ బెండ్లాడినవారిభాగ్యము
సిరులనీమహిమలు చెప్పఁ గొత్తలు

ముప్పిరిగొనఁ గని మోవి చూచితే
దప్పులుదేరు నందరు తరుణులకు
కప్పిన నీమేనితావిగాలి విసరితే
అప్పుడే విరహపుటలయిక మానును

మనసారా నీతోను మాఁటలాడితే
ఘనముగా నెమ్మోములఁ గళలెక్కును
చనవిచ్చి నీవు మాసంగడిఁ గూచుండితే
తనివిఁబొందు గక్కనఁ దనువులెల్లాలను

చేతనంటి నీమేనిసేవ సేసితే
కాతరపుఁ గోరికలు కడుఫలించు
యీతల శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
నీతితో నన్నేలితివి నిండు నిఁక కీర్తులు 


ఆపదలె సంపదలకాధారమై - Apadale Sampadalakadharamai

ఆపదలె సంపదలకాధారమై తోఁచె
పైపైనె తమకంబె పరిణామమాయ

పురిగొన్న మదనాగ్ని పుటము దాఁకినవలన
తరుణిదేహంబు కుందణమువలెనాయ
సురుగక వియోగాగ్ని చొచ్చి వెలువడెఁ గాన
మరుజన్మమై మహామహిమఁ బొగడొందె

పొలుపైన యిరు (విరు) లచేఁ బూవుగట్టిన వలన
సొలయకే మేను జాజుల పొట్లమాయి
నెలకొన్న గొజ్జంగనీటఁ దడియఁగఁబట్టి
కలకంటిమేను పులు గడగినట్లాయ

అందుపైఁ దిరువేంకటాద్రీశు నిజకృపా-
నందంబు తనకు బ్రహ్మానందమాయ
పొందైన వేడుకలు పొదిగొన్న చెలువంబు-
నందమయి సౌభాగ్యమగ్గలంబాయ 


జగన్మోహనాకార - Jaganmohana kara

జగన్మోహనాకార చతురుఁడవు పురుషోత్తముఁడవు
వెగటు నాసోదంబు ఇది నీవెలితో నావెలితో

యెన్నిమారులు సేవించినఁ గన్నులూ దనియవు
విన్న నీకథామృతమున వీనులుఁ దనియవు
సన్నిధిని మిమ్ము నుతియించి సరుస జిహ్వయుఁ దవియదు
విన్న కన్నది గాదు ఇది నావెలితో నీవెలితో

కడఁగి నీప్రసాదమే కొని కాయమూఁ దనియదు
బడిఁ బ్రదక్షిణములుసేసి పాదములు నివిఁ దనియవు
నుడివి సాష్టాంగంబు చేసి నుదురునూఁ దనియదు
వెడఁగుఁదన మిది గలిగె నిది నావెలితో నీవెలితో

చెలఁగి నిను నేఁ బూజించి చేతులూఁ దనియవు
చెలువు సింగారంబు దలఁచి చి త్తమూఁ దనియదు
అలరి శ్రీవేంకటగిరీశ్వర అత్మ నను మోహించఁజేసితి
వెలయ నిన్నియుఁ దేరే మును నీవెలితో నావెలితో 


ఈకెకు నీకుఁ - Eekieku Niku

ఈకెకు నీకుఁ దగు నీడుజోడులు
వాకుచ్చి మిమ్ముఁ బొగడవసమా యొరులకు

జట్టిగొన్ననీదేవులు చంద్రముఖిగనక
అట్టె నిన్ను రామచంద్రుఁ డనఁదగును
చుట్టమై కృష్ణవర్ణపుచూపులయాపెగనక
చుట్టుకొని నిన్ను కృష్ణుఁడవనఁదగును

చందమైనవామలోచన యాపె యౌఁగనక
అందరు నిన్ను వామనుఁ డనఁదగును
చెంది యాకె యప్పటిని సింహమధ్యఁగనక
అందినిన్ను నరసింహుండని పిల్వఁదగును

చెలువమైనయాపె శ్రీదేవి యగుఁగనక
అల శ్రీవక్షుడవని యాడఁదగును
అలమేల్మంగ యహిరోమాళిగలదిగన
యిల శేషాద్రి శ్రీవేంకటేశుఁ డనఁదగును 


ఇదివో సంసారమెంత - Idivo Samsaramentha

ఇదివో సంసారమెంత సుఖమో కాని
తుదలేని దుఃఖమను తొడవు గడియించె

పంచేద్రియంబులను పాతకులు దనుఁదెచ్చి
కొంచెపు సుఖంబునకుఁ గూర్పఁగాను
మించి కామంబనేడిమేఁటి తనయుండు జని-
యించి దురితధనమెల్ల గడియించె

పాయమనియెడి మహాపాతకుఁడు తనుఁ దెచ్చి
మాయంపు సుఖమునకు మరుపఁగాను
సోయగపు మోహమను సుతుఁడేచి గుణమెల్లఁ
బోయి యీనరకమనుపురము గడియించె

అతిశయుండగువేంకటాద్రీశుఁడను మహా-
హితుఁడు చిత్తములోన నెనయఁగాను
మతిలోపల విరక్తిమగువ జనియించి య-
ప్రతియయి మోక్షసంపదలు గడియించె 


పరమ పురుషుఁడు - Paramapurushudu

పరమ పురుషుఁడు గోపాలబాలుఁ డైనాఁడు
మురహరుఁడు యెదుట ముద్దుగారీ నిదివో

వేదపురాణములలో విహరించే దేవుఁడు
ఆది మూలమైనట్టి అలబ్రహ్మము
శ్రీ దేవి పాలిటఁ జెలఁగే నిధానము
సేద దేరి యశోదకు శిశువాయ నిధివో

మొక్కేటి నారదాదుల ముందరి సాకారము
అక్కజపు  జీవులలో అంతర్యామి
గక్కన బ్రహ్మ  గొడుకుఁగాఁ  గన్న పరమము
అక్కరతో వెన్నముచ్చై యాటలాడీ నిదివో

దేవతలఁ గాచుటకు దిక్కయిన విష్ణుఁడు
భావము లొక్కరూపైన భావతత్త్వము
శ్రీ వేంకటాద్రి మీఁద జేరున్న యా వరదుఁడు
కైవసమై గొల్లెతల కౌఁగిళ్ళ నిదివో