Sunday, February 26, 2023

పరమ పురుషుఁడు - Paramapurushudu

పరమ పురుషుఁడు గోపాలబాలుఁ డైనాఁడు
మురహరుఁడు యెదుట ముద్దుగారీ నిదివో

వేదపురాణములలో విహరించే దేవుఁడు
ఆది మూలమైనట్టి అలబ్రహ్మము
శ్రీ దేవి పాలిటఁ జెలఁగే నిధానము
సేద దేరి యశోదకు శిశువాయ నిధివో

మొక్కేటి నారదాదుల ముందరి సాకారము
అక్కజపు  జీవులలో అంతర్యామి
గక్కన బ్రహ్మ  గొడుకుఁగాఁ  గన్న పరమము
అక్కరతో వెన్నముచ్చై యాటలాడీ నిదివో

దేవతలఁ గాచుటకు దిక్కయిన విష్ణుఁడు
భావము లొక్కరూపైన భావతత్త్వము
శ్రీ వేంకటాద్రి మీఁద జేరున్న యా వరదుఁడు
కైవసమై గొల్లెతల కౌఁగిళ్ళ నిదివో 


No comments:

Post a Comment