Friday, December 30, 2022

హరి హరి నీ మాయ - Hari Hari Ni maya

హరి హరి నీ మాయామహిమ
సరవి దెలియ ననుఁ గరుణించఁగదే

తలఁతును నా పాలిదైవమవని నిను
తలఁతును తల్లివిఁ దండ్రివని
మలసి యంతలో మఱతును తెలుతును
కలవలె నున్నది కడ గనరాదు

మొక్కుదు నొకపరి మొగి నేలికవని
మొక్కుదు నీ వాదిమూలమని
వుక్కున గర్వించి యుబ్బుదు సగ్గుదు
కక్కసమైనది కడ గనరాదు

చూతును నీమూర్తి సులభుఁడవనుచును
చూతు జగములకు సోద్యమని
యీతల శ్రీవేంకటేశ నన్నేలితివి
కౌతుకమొదవెను కడ గనరాదు 

పన్నీరు చల్లెరా నీపై - Panniru Callera Neepai

పన్నీరు చల్లెరా నీపై పలచని దెవ్వతో
అన్నువయలపుతోడ నసలాయఁ జెక్కులు

కప్పురము చల్లె నీపై కలికి యదెవ్వతో
యిప్పుడె నీ వురమెల్ల నెఱ్ఱ నాయను
చెప్పరాని మురిపెంపు చేఁతలెల్ల నాకును
కప్పిఁన గప్పఁగరాని గతులాయ నిప్పుడు

మృగనాభి చల్లె నీపై మెలుఁత యదెవ్వతో
తెగువ నీమోమెల్ల తెల్లనాయను
నగవు మేలము గాదు నమ్మరా నా పలుకు
సగమాయ నిప్పుడే యీ చక్కని నీ దేహము

కుంకుమ చల్లెర నీపై కోమలి యదెవ్వతో
సంకె దేరి నీమేనెల్లా చల్లనాయను
వేంకట విభుఁడ నీకు వెచ్చమైతిఁ జెప్పరా
వుంకువగా నాకు నబ్బె ఉదుటు నీచేఁతలు


అంగన విభుఁగూడే - Angana Vibhugu Dedi

అంగన విభుఁగూడే దది యేకాలమో కాక
అంగజుని కిది గాల మాయనో కాక

చెలియచెంపలనుండి సేవంతిరేకులే రాలె
అలరువసంతకాల మాయనో కాక
కలికికన్నులనుండి కన్నీటిబొట్లు రాలె
యెలమి వానకాల మిదియో కాక

కాంతవిరహపుమేనఁ గాఁకలయెండలు గాసె
యింతలో వేసవికాల మిదియో కాక
వింతపులకమొగము వెన్నెలతేటలు గాసె
యింతట శరత్కాల మిదియో కాక

శ్రీవేంకటేశుఁ జూచి సిగ్గు లీ కామిని చిందె
యీవేళ హిమంతకాల మిదియో కాక
భావించి యీతనిఁ గూడ పయ్యద మేనఁ గప్పె
ఆవటించు చలికాల మదియో కాకా 


మత్స్య కూర్మ వరాహ - Matsya Kurma Varaha

మచ్చ కూర్మ వరాహ మనుష్యసింహ వామనా
యిచ్చ రామ రామ రామ హితబుద్ధి కలికీ

నన్నుఁ గావు కేశవ నారాయణ మాధవ
మన్నించు గోవింద విష్ణు మధుసూదన
వన్నెల త్రివిక్రమ వామనా శ్రీధరా
సన్నుతించే హృషీకేశ సారకు పద్మనాభ

కంటిమి దామోదర సంకరుషణ వాసుదేవ
అంటేజాలు ప్రద్యమ్నుఁడా అనిరుద్దుఁడా
తొంటే పురుషోత్తమ అథోక్షజ నారసింహమా
జంటవాయకు మచ్యుత జనార్దన

మొక్కేము వుపేంద్ర హరి మోహన శ్రీ కృష్ణరాయ
యెక్కితి శ్రీ వేంకట మిందిరానాథ
యిక్కువ నీ నామములు యివియే నా జపములు
చక్కఁగా నీ దాసులము సర్వేశ అనంత 


Tuesday, December 27, 2022

జీవుఁడ నేనొకఁడను - Jivuda Nenokadanu

జీవుఁడ నేనొకఁడను సృష్టికిఁ గర్తవు నీవు
యీవల ధర్మపుణ్యములివివో నీచేతివి

పుట్టినయట్టి దోషాలు పురుషోత్తమా నీవు
పట్టి తెంచివేయక పాయనేరవు
గట్టిగా సంసారములోఁ గలిగిన లంపటాలు
ముట్టి నీ వల్లనేకాని మోయరావు

పంచభూత వికారాలు పరమాత్ముఁడా నీవే
కొంచక నీయాజ్ఞఁగాని కొద్ది నుండవు
అంచెల జగములోని ఆయా సహజములు
వంచుక నీవల్లఁగాని వైపుగావు

చిత్తములో విజ్ఞానము శ్రీవేంకటేశ నీవె
హత్తించి చూపినఁగాని యంకెకురాదు
సత్తుగా నిన్నిటికి నీశరణుచొచ్చితి మిదె
నిత్తెముఁ గావఁ బ్రోవ నీయిచ్చే యిఁకను


భక్తి నీపైదొకటె - Bhakti Nepaidhokate

భక్తి నీపైదొకటె పరమసుఖము
యుక్తి చూచిన నిజంబొక్కటే లేదు

కులమెంత గలిగె నది కూడించు గర్వంబు
చలమెంత గలిగె నది జగడమే రేఁచు
తలఁపెంత పెంచినాఁ దగిలించు కోరికలు
యెలమి విజ్ఞానంబు యేమిటా లేదు

ధన మెంత గలిగె నది దట్టమౌ లోభంబు
మొనయుఁ జక్కందనంబు మోహములు రేఁచు
ఘనవిద్య గలిగినను కప్పుఁ బైపై మదము
యెనయఁగఁ బరమపద మించుకయు లేదు

తరుణు లెందరు‌అయిన తాపములు సమకూడు
సిరులెన్ని గలిగినను చింతలే పెరుగు
యిరవయిన శ్రీవేంకటేశ నినుఁ గొలువఁగా
పెరిగె నానందంబు బెళకు లిఁకలేవు


దేవుఁడుగలవారికి - Devudu Gala Variki

దేవుఁడుగలవారికి దిగులుఁ జింతయు లేదు
శ్రీవిభుఁడే అన్నిటా రక్షించుఁ గనక

యేలికగల బంటుకు యేవిచారము లేదు
వోలి మగఁడుగలాలికి వొప్పమి లేదు
పోళిమిఁ దండ్రిగల పుత్రుని కంగద లేదు
మేలుగాఁ బండిన భూమికిఁ గరవు లేదు

బలముగల రాజుకు భయమేమియు లేదు
కలిమిగలవాని కక్కర లేదు
యిల నాచారవంతుని కేపాపమును లేదు
తలఁపు బుణ్యముగల‌ అతనికిఁ జేటు లేదు

గురువుగలవానికిఁ గొఱఁత యేమియు లేదు
పరముగలవానికి భ్రాంతులు లేవు
యిరవై శ్రీవేంకటేశుఁ డిన్నిటా మాకుఁ గలఁడు
అరయ దాసులము మా కడ్డాఁకే లేదు


నమో నారాయణాయ - Namo Narayanaya

నమో నారాయణాయ నమః
సమధికానందాయ సర్వేశ్వరాయ

ధరణీసతీఘన స్తనశైలపరిరంభ-
పరిమళశ్రమజలప్రమదాయ
సరసిజనివాసినీ సరసప్రణామయుత-
చరణాయ తే నమో సకలాత్మకాయ

సత్యభామాముఖాంచనపత్రవల్లికా-
నిత్యరచనక్రియానిపుణాయ
కాత్యాయనీస్తోత్రకామాయ తే నమో
ప్రత్యక్షనిజపరబ్రహ్మరూపాయ

దేవతాధిపమకుటదివ్యరత్నాంశుసం-
భావితామలపాదపంకజాయ
కైవల్యకామినీకాంతాయ తే నమో
శ్రీవేంకటాచల శ్రీనివాసాయ


కొంచెమును ఘనముఁ - Koncemunu Ghanamu

కొంచెమును ఘనముఁ గనుఁగొననేల హరిఁదలఁచు
పంచమహాపాతకుఁడే బ్రాహ్మణోత్తముఁడు

వేదములుచదివియును విముఖుఁడై హరికథల
నాదరించనిసోమయాజికంటె
యేదియునులేనికులహీనుఁడైనను విష్ణు
పాదసేవకుఁడువో బ్రాహ్మణోత్తముఁడు

పరమమగువేదాంతపఠన దొరకియు సదా
హరిఁదలఁచలేని సన్న్యాసికంటె
మరిగి పసురముఁదినెడిమాలయైనను వాఁడె
పరమాత్ముఁ గొలిచినను బ్రాహ్మణోత్తముఁడు

వినియుఁ జదివియు రమావిభునిఁ దలఁపక వృథా
తనువు వేఁపుచుఁ దిరుగుతపసికంటె
చనవుగల వేంకటేశ్వరుదాసులకు వెంటఁ
బనిదిరుగునధముఁడే బ్రాహ్మణోత్తముఁడు


Sunday, December 18, 2022

దేవర విన్నిటా - Devaravu Innita

దేవర విన్నిటా నీకు దేవుల నేను
నీవనిత నెప్పుడూను నేర మెంచకువయ్యా

చెక్కు నొక్కి నీకు నేను సేసినట్టి వినయాలు
వక్కణగా నీ మనసు వచ్చునా నేఁడు
కక్కసించఁగదా నీకుఁ గప్పురవిడె మిచ్చితి
దక్కివున్నదానను నాతప్పు లెంచకువయ్యా

పాదము లొత్తి నే నీపనుల నుండిన మేలు
యీదెస నీవూడిగాల కెక్కేనా నేఁడు
తోదోపులు గావుగదా దొమ్ములుగా నే మొక్కితి
ఆదినుండి నిన్నే కోరే మౌఁగాదనకు వయ్యా

కందువనీకాఁగిటను కలసిన భోగములు
చెంది నీకు నిన్నిటాను సెలవా నేఁడు
సందడి సేయఁగదా నీ సరుస శ్రీ వేంకటేశ
యెందును నీ మేనవార మెరవుగాకువయ్యా  


ఇదివో తెలుసుకొమ్మా - Idivo Telusukomma

ఇదివో తెలుసుకొమ్మా యీరెంటికి నీవే గురి
పదివేలు విన్నపాలు భావించుకోనీవే

సరవితో నడచితే జగడముఁ జవులే
విరసాన నడచితే వెగటౌఁ బొందు
నిరతి నావద్దనుంటే నీవేమన్నా నాకునింపౌ
పరులవొద్దనుంటే నీపలుకే వేసటలు

తగవులు దప్పకుంటే తమవారే యిందరును
యెగసక్యమైతే తనయిల్లే యెరవు
నగుతా నీవూరకుంటే ననుపులీడేరును
మొగము ముణుచుకొంటే మోపులౌఁ బ్రియములు

కాఁగలించుకొంటేను కపటమంతయుఁ బాసు
ఆఁగుక వూరకుండితే అదియే కాఁక
వీఁగక శ్రీ వేంకటేశ వెస నన్నుఁగూడితివి
మాఁగిన నీనా మనసు మాఁటువే యిన్నియును 


గోవిందా మేల్కొనవయ్యా - Govinda Melkonavayya

గోవిందా మేల్కొనవయ్యా
కావించి భోగము కడమా నీకు

కమలజ చల్లనికాఁగిటఁ దగిలి
సమరతి బాయఁగఁ జాలవూ
కమలభవాదులు కడు నుతియింపఁగ
విమలపుశయనము విడువగ లేవు

భూసతితోడుత పొందులు మరిగి
వేసర విదె నీవేడుకలా
వాసవముఖ్యులు వాకిట నుండఁగ
పాసి వుండ నని పవళించేవూ

నీళామనసిజలీలలఁ దగిలి
నాలితోడ మానఁగ లేవూ
వేళాయను శ్రీవెంకటనాథుఁడ
పాలించి దాసుల బ్రతికించఁగనూ 


వీఁడివో కొలువున్నాఁడు - Vidivo Koluvunnadu

వీఁడివో కొలువున్నాఁడు విట్ఠలేశుఁడు
మూఁడుమూర్తుల తేజపు మూలమీతఁడు

పంతముతో పాండవపక్షపాతి యీతఁడు
వింతలేని విదురునివిందు యీతఁడు
మంతు కెక్కిన ద్రౌపదీ మాన రక్షకుఁడీతఁడు
చెంతనే వుద్ధపు పాలి చింతామణి యీతఁడు

మందగొల్లెతలకెల్లా మంగళసూత్ర మీతఁడు
కందువ నక్రూరుని భాగ్యం బీతఁడు
నందగోప యశోదల నవనిధాన మీతఁడు
అందపురుక్మిణీ మనోహరుఁ డీతఁడు

దేవకీవసుదేవుల దివ్యపద వీతఁడు
భావింప నందరిపరబ్రహ్మ మీతఁడు
కైవశమై దాసులకు కల్పవృక్ష మీతఁడు
శ్రీవేంకటాద్రి మీఁదిశ్రీపతి యీతఁడు 


దిబ్బలు వెట్టుచుఁ - Dibbalu Vettuchu

దిబ్బలు వెట్టుచుఁ దేలిన దిదివో
ఉబ్బు నీటిపై నొక హంసా

అనువునఁ గమలవిహారమై నెలవై
వొనరి వున్నదిదె వొక హంసా
మనియెడి జీవుల మానససరసుల-
వునికి నున్న దిదె వొక హంసా

పాలునీరు నేర్పరిచి పాలలో-
నోలనాడె నిదె వొక హంసా
పాలుపడిన యీ పరమహంసముల-
వోలి నున్నదిదె వొక హంసా

తడవి రోమరంధ్రంబుల గుడ్ల-
నుడుగక పొదిగీ నొక హంసా
కడువేడుక వేంకటగిరి మీఁదట-
నొడలు వెంచెనిదె యొక హంసా 

జపింయించరె సర్వజనులు - Japinchare Sarvajanulu

జపింయించరె సర్వజనులు యీ నామము తమ
రపమునో పుణ్యాలకు రామనామము

శాంతికరము రామచంద్ర నామము
భ్రాంతు లణఁచు రామభద్ర నామము
వింతసుఖ మిచ్చు రఘువీర నామమూ, భూమి
చింత దీర్చునదివో శ్రీరామనామము

కలిదోషహరము రాఘవనామము సర్వ
ఫలదము సీతాపతి నామము
కులక శోభనము కాకుత్థ్సనామము అని
రలమైన దిదివో రామనామము

గుమిత మైనది రఘుకులనామము అతి
సుముఖము దశరథసుత నామము
అమితమై శ్రీవేంకటాద్రి నాయకుఁడై
రమియించె యీతని రామనామము