Saturday, March 26, 2022

సిగ్గరిపెండ్లికొడుక - Siggari Pendlikoduka

సిగ్గరిపెండ్లికొడుక చిలువరాయ నన్ను
వెగ్గళించ కిఁక నీవు వెసఁ జెలువరాయ

చెరువుకొ నీతురుము చెలువరాయ నీవు
శిరసు వంచకు మంత చెలువరాయ
సిరితో వీదులనేఁగేచెలువరాయ నీ -
నెరబడి వారము చెలువరాయ

చెక్కులేల చెమరించెఁ జెలువరాయ అట్టె
చిక్కనిబొంకు బొంకేవు చెలువరాయ
చిక్కువడె నీనెరులు చెలువరాయ నన్ను
జిక్కించేవు మాటలనే చెలువరాయ

చెప్పరానితమకపు చెలువరాయ నన్నుఁ
జిప్పిలఁ గూడితివిగా చెలువరాయ
యిప్పుడే శ్రీవేంకటేశ యేకతము కడపలోఁ
జెప్పితిఁగా అలనాఁడే చెలువరాయ 

Watch for Audio - https://youtu.be/aE67_UW360Y

నీవు వెట్టినట్టి చిక్కు - Nivu Vettinatti Chikku

నీవు వెట్టినట్టి చిక్కు నీవే తెలుపవలె
నావశమా తెలియ నారాయణా

నీటిలోన నొకబుగ్గ నిమిషములోనఁ బుట్టి
కోటిసేసినట్లుండుఁ గొంతవడి
పాటించి యందే యడఁగెఁ బ్రకృతియో బ్రహ్మమో
యేఁటిదో వీనియర్థ మెరిఁగించవయ్య

ఆకసాన నొకగాలి అట్టె మ్రోయుచుఁ బొడమి
లోకము సేయ విసరు లోలోనె
మైకొని యందే యడఁగె మాయయో సత్యమో
యీకడ నీయర్థము మా కెఱిఁగించవయ్య

భూమిలోన మొలకలు పుట్టుచు శ్రీవేంకటేశ
వాములై వెలయు సేసేవారికి
ఆముక యందే యడఁగె అసత్తో ఇది సత్తో
యేమో యీయర్థము మా కెరిఁగించవయ్య 

Nivu vettinatti chikku nive telupavale
Na vashama teliya narayana 

Nitilona nokabugga nimishamulonabutti
Kotisesinatlumdu gonthavadi
Patinchi yande yadage brakruitiyo brahmamo
Yetidho viniyartha merigimchavayya

Aakasana nokagali atte mroyuchu bodami
Lokamu seya visaru lolone
Maikoni yandhe yadage mayayo satyamo
Eekada niyarthamu ma kerigimchavayya 

Bhumilona molakalu puttuchu SriVenkatesha
Vamulai velayu sesevariki
Amuka yandhe yadage asatto idi satto
Yemo yiyarthamu ma kerigimchavayya 

Watch for Audio - https://youtu.be/pUFbpWMNreQ

సంతోషించితిమి నిన్ను - Santosinchitimi Ninnu

సంతోషించితిమి నిన్ను చల్లఁగాఁబెండ్లాతివి
యింతటివాఁడ వైతివియేమనేము నిన్నును

వొఱపైనజాణఁడవు వొక్కఁడవే యింతటికి
గుఱి నీ వలపులైతే కోటానఁగోటి
పఱపుపైఁ జాచితేను పదారువేలు దేవుళ్ళు
యెఱఁగము నీమహిమ లేమనేము నిన్నును

వొలసితే నొకతెను వురమెక్కించుకొందువు
పిలిచి వొకతె నెత్తిఁబెట్టుకొందువు
తలుపు దెఱచితేను దండనెల్లా గొల్లెతలే
యిల నిన్ను గెలువలే మేమనేము నిన్నును

గొందిఁ బవ్వళించితేనే గోవిందరాజవు నీవు
కందువ నిలుచుంటే శ్రీవేంకటపతివి
అందుకొంటేనే యిద్దరంగనలు పాదాలొద్ద
యిందరిలోమమ్మేలితి వేమనేము నిన్నును

Watch for Audio - https://youtu.be/dR5kGf_MYsQ

మంచి గుణములుగల - Manchi Gunamulugala

మంచి గుణములుగల మగువల సాజ మిది
యెంచుకొని దయతోడ నేలుకొనవయ్యా

మనసు నమ్మిన సతి మరి యనుమానించదు
ననిచిన వనిత పెనఁగులాడదు
యెనసిన జవరాలు యెరవులుసేయదు
పనుపడి రతులకు బాఁతిపడుఁగాని

మరిగిన యాఁటది మరి పాయనేరదు
దొరసిన యిల్లాలు దూర దెంతైనా
సరి నిచ్చకపులేమ జరపులఁ బెట్టదు
యిరవైన కాఁపురాన కేఁకారుఁగాని

తగులైన కామిని తప్పులేమీ నెంచదు
మొగమిచ్చకపు ఇంతి వెగటాడదు
నిగిడి శ్రీవేంకటేశ నీదేవు లలమేల్మంగ
సొగిసి యీకూఁటముల జొక్కించుఁగాని 

Watch for Audio - https://youtu.be/o4THFedyVI4

Tuesday, March 1, 2022

వీడెపుఁ బెదవితోడి - Vedupu Bedavitodi

వీడెపుఁ బెదవితోడి విట్ఠలేశుఁడు
వేడుకలే పచరించీ విట్ఠలేశుఁడు

నిలుచున్నాఁ డలవాఁడు నిక్కి నామోము చూచి
వెలుపల సన్న సేసె విట్ఠలేశుఁడు
సెలవుల నవ్వి చెలితోడ మాటలాడి
వెలుగొందీ సొమ్ములతో విట్ఠలేశుఁడు

కన్నులనే మెచ్చుమెచ్చి కందువకుఁజేయిచాఁచి
విన్నపము లడిగీని విట్టలేశుఁడు
తన్నుఁ దానె విఱ్ఱవీఁగీ తన మీఁద నానవెట్టీ
వెన్నతిన్ననోరితోడి విట్ఠలేశుఁడు

బడిబడినే వచ్చి పై కొని నన్నుఁగూడి
విడువఁడు నాచెఱఁగు విట్ఠలేశుఁడు
కడుఁగడుఁ దమకించీ కప్పురమే చేతికిచ్చి
వెడఁగు శ్రీ వేంకటాద్రిం విట్ఠలేశుఁడు

Watch for Audio - https://youtu.be/kvBN4JZrtlM

తిమ్మిరెడ్డి మాకునిచ్చె - Timmireddy Makuniche

తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైనపొలము
బొమ్మిరెడ్డి కప్పగించి పోదిసేసెఁ బొలము

నిండినట్టి మడుగుల నీరువంకపొలము
కొండలు మోఁచినపెద్ద గొబ్బరపుఁబొలము
అండనే పొలము రాజులుండేటి పొలము
చెండివేసి మాకులెల్లా సెలగినపొలము

అసపడి వరదానమడిగిన పొలము
బాసలతోఁ గడు నెత్రుపట్టమైనపొలము
రాసికెక్కేమునులకు రచ్చైన పొలము
వేసరక నాఁగేట వేగిలైన పొలము

మంచి గురుతైన రావిమానిచేని పొలము
వంచిన గుఱ్ఱముఁ దోలే వయ్యాళి పొలము
యెంచఁగ శ్రీవేంకటేశు నిరవైన పొలము
పంచుకొని లోకులెల్లా బ్రదికేటి పొలము

Watch for Audio - https://youtu.be/bI5ecqjotb0

శ్రీవేంకటేశ్వరుఁడు - Sri Venkateswarudu

శ్రీవేంకటేశ్వరుఁడు చేరి విజయముఁ బొంది
దేవతలు చూడ దశదిక్కులకు నేసెను

అరికమ్ము వేసెనట్టె అల్లనరకాసురుపై
మేరమీరి రావణునిమీఁద నేసెను
సారపుజలధిమీఁద జలములింకఁగ నేసెను
దారి దప్పకుండ నేడుదాళ్లు దెగనేసెను

పగదీర మింటిమీఁది బాణునిమీఁద నేసెను
మిగుల మెరసి మాయమృగము నేసెను
జగములో రాక్షసుల సంహారముగ నేసెను
నిగిడి రక్తగుండాలు నిండ నేసెను

ఖరదూషణాదుల కడిఖండలుగ నేసెను
సరుసఁ గుంభకర్ణునిఁ జావనేసెను
అరిది శ్రీవేంకటేశుఁ డలమేలుమంగఁ గూడి
గరుడనిమీఁద నెక్కి కంటువాయ నేసెను 

Watch for Audio - https://youtu.be/him2HrDKaIg

కరుణించవయ్య మమ్ముఁ - Karuninchavayya Mammu

కరుణించవయ్య మమ్ముఁ గంభమురాయ
పెరెదేవుని కాలువపెద్దకంభము రాయ

కలకలనవ్వు దేరేఁ గంభమురాయ ఇంతి-
కలికితనాలు చూడు కంభమురాయ
కలిమికాంత తొడెక్కెఁ గంభమురాయ నీపైఁ
గలువదండలు వేసెఁ గంభమురాయ

కనకపువన్నె మేనికంభమురాయ ఇంతి
కనుఁగవలనే మొక్కీఁ గంభమురాయ
ఘనుఁడ వన్నిటా నీవు కంభమురాయ
కనుకో వలపులెల్లాఁ గంభమురాయ

కందర్ప కోటిరూప కంభమురాయ ఇంతిఁ
గందువలఁ గూడితివి కంభమురాయ
గంద మిచ్చి నన్నేలితి కంభమురాయ మేలు
గందము శ్రీ వేంకటాద్రి కంభమురాయ

Watch for Audio - https://youtu.be/bNYzGu6vE6o

దేవుఁడు దేవియు - Devudu Deviyu

 దేవుఁడు దేవియు నదె తెరదియ్యరె

పూవులదండలు దీసి పువ్వులియ్యరె కన్నుల నిద్దురదేర గక్కన మేలుకొని వున్నతి మొకాలు చూచే రొకరొకరు పన్నీ రందియ్యరె పావడలు నందియ్యరె గన్ననఁ గాళాంజి దగ్గరఁ బట్టరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచిండి వొగిఁ గురులు దిద్దే రొకరొకరు తగ నద్దాలు చూపరె తతితో బాగాలియ్యరె వొగరుదేరఁ గస్తూరి వుండ లియ్యరే బిగ్గెఁ గాఁగిలించుకొంటా ప్రియములె ఆడుకొంటా వొగ్గిరి రతులకును వొకరొకరు అగ్గమై శ్రీవెంకటేశుఁ డలమేలుమంగాఁ గూడి వెగ్గళించే రలపార విసరరే యిపుడు