Thursday, September 26, 2024

ఇన్నిటిమూలము యీతనిరూపు - Innitimulamu Eethanirupu

ఇన్నిటిమూలము యీతనిరూపు
యెన్నఁగ నుపములకు నిరవైనట్లుండె

కమలనాభునికిఁ గప్పురకాపు మేన
సముచితముగఁ బైపైఁ జాతినపుడు
అమృతము దచ్చేవేళ అట్టె మేనఁ దుంపురులు
తమితోడ నిండుకొని దట్టమైనట్లుండె

దైవశిఖామణికి తట్టుపుణుఁగు మేనను
చేవమీర నించి సేవసేసేయపుడు
వేవేలుగా యమునలో వేమారునీఁదులాడఁగా
కావిరి కాళిమ నిండాఁ గప్పినయట్టుండె

అలమేలుమంగతోడ నట్టె శ్రీవేంకటపతి
కెలమిసొమ్మువెట్టి యెంచినపుడు
కలికి గొల్లెతలను కూడఁగా గుబ్బలమీఁదఁ
గలపసపెల్లా వచ్చి కమ్ముకొన్నట్లుండె 

Watch for audio - https://youtu.be/oek0G7vEm4Q 

కొండా చూతము రారో- Konda Chutamu Raro

కొండా చూతము రారో కోండుక తిరుమలకొండా
కొండని యడిగిన వరము లొసఁగు మా కొండలతిమ్మయ కొండా

పొదలూ సొంపగు నింపుల పూబొదలూ వాసననదులూ
కొదలూ గల తామరకొలఁకులపై మెదలుఁ దుమ్మెదలూ
కదలి మలయానిలు వలపులపన కదళీవనములునూ
మొదలు గా నెల్లప్పుడు నీ సంపదలు గల మా కొండా

తలఁచిన శుకశౌనకాదులకు తలఁచిన తలఁ పొసఁగినా
తలఁపు లోపల నెలకొన్నా దయతో నన్నేలినా
చెలువుఁడు మావెంకటరాయఁడు సిరులనెలవు చేకొన్నా
కలియుగవైకుంఠం బనునామము గలిగి వెలయు మా కొండా 

Watch for audio - https://youtu.be/8nSiFx8meJs 

పేరు కుచ్చి యాతనితో - Perukuchi Yathanitho

పేరు కుచ్చి యాతనితో పిలిపించుకోవలెనా
చేరి వీడెమియ్యఁగదే సిగ్గులింకా నేఁటికి

సరి నీవు నవ్వితేనే సరసానఁ బైకొంట
యిరవుగాఁ జూచితేనే యియ్యకొనుట
గరిమ మాటాడితేనే కంకణము గట్టుకొంట
సరుగ రావే యేల జాగులు సేసేవు

చేరి తిట్టినప్పుడే చేఁతలకు లోనౌట
సారెఁ బయ్యద మూయుటే చవి రేఁచుట
కోరఁగా నానవెట్టుట గోరికొనకు లోనౌట
కూరిమి చేకొని రావే గుట్టింతచూపక

యెదురెదురనుంటేనే యిచ్చల సేసవెట్టుట
యిదె చెక్కుచేయంటితే నింపు చల్లుట
అదన శ్రీవేంకటేశుఁడాతఁడు తా నిన్నుఁగూడె
చెదరకిట్ల రావే చెప్పించుకొనక 

Watch for audio - https://youtu.be/Aeb7O-gn8j0 

వేడుకకాఁడ వౌదువు - Veduka kadavauduvu

వేడుకకాఁడవౌదువు విట్ఠలేశా నాకు
వీడెమిచ్చేవప్పటిని విట్ఠలేశా

వాసితో నీవద్దఁ దలవంచుకొంటేనంతలోనే
వేసేవు పూవులఁ గొని విట్ఠలేశా
ఆసపడి నీమీఁద నాకానలేల పెట్టేవు
వీసమంత పనికైన విట్ఠలేశా

సన్నల నీవద్ద నేను సమ్మతించకుండఁగానే
వెన్నెలనవ్వు నవ్వేవు విట్ఠలేశా
చన్నులంటి వూరకైనా సరసములాడేవు
విన్న కన్న సుద్దిగాడు విట్ఠలేశా

పలుకకుండితే నాతో బండుఁబూతుఁ గెలసేవు
వెలయ శ్రీవేంకటాద్రి విట్ఠలేశా
బలిమి నన్ను గూడఁగాఁ బనులెల్లాఁ జక్కనాయ
వెలుపలే లోనాయ విట్ఠలేశా 

Watch for audio - https://youtu.be/6YNeCxUgTqM 

వీఁడివో లక్ష్మీపతి - Vidivo Laxmipathi

వీఁడివో లక్ష్మీపతి వీఁడివో సర్వేశుఁడు
వీఁడివో కోనేటిదండ విహరించే దేవుఁడు

కొండ గొడగుగ నెత్తి గోవులఁ గాచె నాఁడు
కొండవంటి దానవునిఁ గోరి చించెను
కొండ శ్రీవేంకటమెక్కి కొలువున్నాఁ డప్పటిని
కొండవంటి దేవుఁ డిదే కోనేటికఱుతను

మాఁకుల మద్దులు దొబ్బి మరి కల్పభూజమనే-
మాఁకు వెరికి తెచ్చెను మహిమీఁదికి
మాఁకుమీఁద నెక్కి గొల్ల మగువల చీరలిచ్చి
మాఁకుల కోనేటిదండ మరిగినాఁ డిదివో

శేషుని పడగెనీడఁ జేరి యశోద యింటికి
శేషజాతి కాళింగుఁ జిక్కించి కాచె
శేషాచలమనేటి శ్రీవేంకటాద్రిపై
శేషమై కోనేటిదండఁ జెలఁగీని దేవుఁడు 

Watch for audio - https://youtu.be/7_n_wAk_els 

అదె చూడరె మోహనరూపం - Ade cudare Mohanapurpam

అదె చూడరె మోహనరూపం
పదిగొట్లుగలభావజరూపం

వెలయఁగఁ బదారువేలుమగువలను
అలమినఘనమోహనరూపం
వలచిననందవ్రజముగొల్లెతల
కులుకుఁజూపులకు గురియగురూపం

యిందిరావనిత నెప్పుడుఁ దనవుర -
మందునిలిపిన మోహనరూపం
కందువభూసతికాఁగిటిసొంపుల -
విందులు మరిగిన వేడుకరూపం

త్రిపురసతుల బోధించిరమించిన
అపురూపపుమోహనరూపం
కపురుల శ్రీవేంకటపతియై యిల
నుపమిఁచగరానివున్నతరూపం 

Watch for audio - https://youtu.be/r-j-BUALHmg 

చూడఁ బిన్నదానవు - Cuda Binnadanavu

చూడఁ బిన్నదానవు జూటుఁదనాలు గనము
వాడికెతోఁ బతి నెంత వలపించేవే

తెలరమఁగులలోని తేటమాఁటలు
విరులఁ బూఁచి వేసేవేడుకలు
పొరుగునఁ గొసరేటిపోరచులు
నిరతితో నెన్నడూ నేరిచితివే

కలికితనాల మించు కనుచూపులు
తలకొన్న చెనకుల తమిరేఁపులు
వులివచ్చిసిగ్గుల వొడఁబాటులు
కలిగించుకొంటి వెంత కత కరచితివే

బడి బడి రతులలో పడితాళాలు
కడఁగి సరసాలలో గబ్బితనాలు
తొడరి శ్రీవేంకటేశు తోడి కూటాలు
కడలేని చేఁత లెందు గడిఇంచుకొంటివే 

Watch for audio - https://youtu.be/Q1sNlVGAogI 

అటువంటివాఁడువో - Atuvantivaduvo

అటువంటివాఁడువో హరిదాసుఁడు
అటమటాలు విడిచి నాతఁడే సుఖి

తిట్టేటిమాటలును దీవించేమాటలును
అట్టే సరెని తలఁచి నాతఁడే సుఖి
పట్టి చంపేవేళను పట్టము గట్టే వేళ
అట్టు నిట్టు చలించనిల యాతడే సుఖి

చేరి పంచదారిడినఁ జేదు దెచ్చి పెట్టినాను
ఆరగించి తనివొందేయతఁడే సుఖి
తేరకాండ్లఁ జూచిన తెగరానిచుట్టముల
నారయ సరిగాఁజూచేయాతడే సుఖి

పొంది పుణ్యము వచ్చిన పొరిఁ బాపము వచ్చిన-
నందలి ఫలమొల్లని యాతడే సుఖి
విందుగా శ్రీవేంకటాద్రి విభునిదాసులఁ జేరి
అందరానిపద మందిననాతఁడే సుఖి

Watch for audio - https://youtu.be/a0pu9qQXBF8