Saturday, May 11, 2024

ఓహో యెంతటివాఁడే - Oho Enthati Vade

ఓహో యెంతటివాఁడే వొద్దనున్నవాఁడే హరి
సాహసపు గుణముల చతురుఁడా యితఁడు

జలధిలోఁ బవళించి జలనిధి బంధించి
జల నిధి కన్యకను సరిఁ బెండ్లాడి
జలనిధిలో నిండి జలనిధి మథియించి
జలధి వెరించిన చలమరా యితఁడు

ధరణికిఁ బతియై ధరణి గ్రుంగిన నెత్తి
ధరణికూఁతురుఁ దానె తగఁ బెండ్లాడి
ధరణిఁ బాదము మోపి ధరణి భారము దించి
ధరణీ ధరుఁడైన దైవమా ఇతఁడు

కొండ గొడుగుగ నెత్తి కొండఁ దూఁటువడ నేసి
కొండకిందఁ గుదురై కూచుండి
కొండపై శ్రీ వేంకటాద్రి కోనేటిరాయఁడై
కొండ వంటి దేవుఁడైన కోవిదుఁడా ఇతఁడు 


No comments:

Post a Comment