Saturday, May 11, 2024

పుట్టెడి దింతా బూటకంబులే - Puttedidanta Butakambule

పుట్టెడి దింతా బూటకంబులే
గట్టిమాయ హరిఁ గానఁగ నీదు

ముక్కున నున్నది ముందటఁ బ్రాణము
యెక్కడ నమ్మేదిఁకఁ దనువు
చుక్కలు మోఁచీఁ జూపులెదుటనే
నెక్కొను మతికిని నిలుకడ యేది

నాలుక నున్నవి నానారుచులును
వేళావేళకు వెరవేది
తోలున నున్నది దొరకొని బ్రతుకిది
కాలంబెటువలెఁ గడపేది

ఆతుమనున్నది యఖిలజ్ఞానము
ఘూతల నెటువలెఁ గనియేది
శ్రీతరుణీపతి శ్రీవేంకటపతి
యాతనిఁగొలిచితి మడ్డంబేది

భావామృతం :
మానవుని పుట్టుక యెంత మాయతో కూడినదో ఆలోచించారా? ఇది వుక్కిరిబిక్కిరి చేసే ‘హరిమాయ'. ఇది తెలుసుకొనే అవకాశాన్నివ్వదు. దీని నెరుగుట అసాధ్యం.
మనమందరం ప్రాణంతో వున్నట్లు యెదురుగా కనిపిస్తున్నా, ఈ ప్రాణం ముక్కున బెట్టుకొన్నట్లు వున్నది. లోపలికి పీల్చిన శ్వాస బయటకు రాకపోయినా, బయటకు వచ్చిన నిశ్వాస తిరిగి లోపలికి పోకపోయినా అంతే సంగతులు. ఇక దీనినెట్లా నమ్మేది? శరీరమన్నా వుండేదా అంటే, చుక్క పొడిచాక ఎదుటనున్నది కాదు. చుక్కలు పోయాక వుంటుందో లేదో తెలీదు. మనస్సు చూద్దామా అంటే నిలకడలేని చంచల స్వభావం కలది. వీటిని నమ్ముకొని నేనేం చేయగలను?
నా నాలుక నానారుచులు కావాలంటుంది. క్షణక్షణానికి దానికో క్రొత్తరుచి కావాలి. దానికి భయభక్తులే లేవు. నవరంధ్రములున్న ఈ తోలు సంచీలో బ్రతుకు గడుపుతున్నాను. ఏ రంధ్రం ఎప్పుడు మూసుకుపోతుందో తెలీదు. ఇట్లా ప్రతిక్షణమూ భయపడుతూ కాలం ఎట్లా గడిపేది? దీనికి గత్యంతరమేమిటి?
అనంతమైన, శాశ్వతమైన జ్ఞానము నా ఆత్మలో వున్నమాట నిజమే. కానీ నాపై నా మనస్సు మొదలైన ఇంద్రియాలు చేసే ఎదురు దాడిని ఎట్లా తట్టుకొనేది? దీని నెలా గమనించగలను? శ్రీలక్ష్మీపతియైన శ్రీవేంకటేశ్వరుడు శరణని కొలిచాను. ఇక సరి, నాకు అడ్డమే లేదు. నన్ను ఏ మాయా ఏమీ చేయలేదు.
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు) 


ఏలోకమందున్నా- Elokamandunna

ఏలోకమందున్నా నేమి లేదు
తాలిమి నందుకుఁదగ్గ దావతే కాని

సురల కసురలకు సూడునుఁ బాడునే కాని
పొరసి సుఖించఁగఁ బొద్దు లేదు
ధరలో ఋషులకును తపము సేయనే కాని
మరిగి భోగించఁగ మరి పొద్దు లేదు

గక్కన సిద్ధులకైనా గంతయు బొంతయే కాని
చిక్కి పరుసము గలిగి సెలవు లేదు
రెక్కలు గలపక్షికి రేసుతిమ్మటలే కాని
చక్క వైకుంఠాన కెగయ సత్తువ లేదు

సకల జంతువులకు జన్మాదులే కాని
అకటా నిత్యానంద మందలేదు
వెకలి శ్రీవేంకటేశువిష్ణుదాసులకే మంచి-
సుకములెల్లాఁ గలవు సుడివడలేదు 


దాసుల పాలిటి నిధానమై - Dasula Paliti Nidhanamai

దాసుల పాలిటి నిధానమై వున్నాఁ డదిగో
ఆసాబాసా నితఁడే అహోబలేశుఁడు

నగె నదె వాఁడిగో నారసింహదేవుఁడు
పగదీర హిరణ్యాక్షుఁ బట్టి చించి
మృగరూపై గద్దెమీఁద మెఱసీవాఁ డదిగో
అగవూఁ దగవెఱిఁగి యహోబలేశుఁడు

తేరిచూచీ నదిగో దేవాదిదేవుఁడు
ఘోరపు నెత్తురు గోళ్ళఁ గురియఁగాను
నేరుపుతోఁ బేగుల జన్నిదాలవాఁ డదిగో
ఆరితేరి కొలువున్నాఁ డహోబలేశుఁడు

కరుణించీవాఁ డదిగో కమలాపతి దేవుఁడు
సురలు గొలువఁగాను సొంపుతోడను
యిరవై లోకములెల్లా నేలుచున్నాఁ డదిగో
హరి శ్రీవేంకటాద్రియహోబలేశుఁడు 


జూడఁగఁ జూడఁగ సుడిగొనె - Judaga Judaga Sudigone

జూడఁగఁ జూడఁగ సుడిగొనె మాయలు
వేడుకతో నిన్ను వెదకే దెపుడో

కడపఁగఁ గడపఁగఁ గాలము గడచెను
జడిసిన వెనకటి జన్మముల
నడవఁగ నడవఁగ నడచె సంసారము
యెడయక హరి నిన్ను యెఱిఁగే దెపుడో

కోరఁగఁ గోరఁగఁ గూడె లంపటము
గారవమగు నిజకర్మముల
మేరలు మీఱఁగ మించెను మమతలు
కూరిమి హరి నిన్నుఁ గొలిచే దెపుడో

నిలుపఁగ నిలుపఁగ నిండెను జ్ఞానము
అలరఁగ శ్రీహరి అనుజ్ఞను
యిలలో శ్రీ వేంకటేశ నీమఱఁ
గలరి చొచ్చి కొనియాడితి మిపుడు 


ఏమి నిద్దిరించేవు - Emi Niddirinchevu

ఏమి నిద్దిరించేవు యెందాఁకాను
కామించి బ్రహ్మాదులెల్లఁ గాచుకున్నా రిదివో

పులుఁగాలుఁ బచ్చళ్ళు బోనము వెట్టినదిదే
వెలయు ధనుర్మాస వేళయు నిదే
బలసి సంకీర్తనపరులు పాడేరిదే
జలజాక్షుఁడ లేచి జలక మాడవయ్యా

తోడనే గంధాక్షతలు ధూపదీపా లివిగో
కూడిన విప్రుల వేద ఘోషణ లివే
వాడుదేరఁ బూజించవలెఁ గమ్మఁబువ్వులివె
వీడెమిదె కొలువుకు విచ్చేయవయ్యా

చదివేరు వైష్ణవులు సారెఁ దిరువాము డిదె
కదిసి శ్రీసతి ముందే కాచుకున్నది
అదనాయ శ్రీవేంకటాధిప మాచరపిదే
యెదుట నిన్నటిమాపే యియ్యకొంటివయ్యా 


అదిగో కొలువై వున్నాడు - Adigo Koluvaivunnadu

అదిగో కొలువై వున్నాడు అలమేలు మంగపతి
పదివేల విధములను పారుపత్తెము జేయుచు

రంగమండపములో రత్నసింహాసనముపై
అంగనామణులతొ అమరవేంచేసి
బంగారు పావడలు పసరించి యిరుగడల
శృంగారముగ సురలు సేవ సేయగను

వెండిపైడి గుదియలను నేత్రహస్తులు పొగడ
నిండు వెన్నెలపూల దండలు అమర
హుండిగను కానుకలను పొనర లెక్కలు జేయ
దండిమీరగ నిపుడు దేవరాయడు చెలగి

అంగరంగ వైభవముల రంగుగా చేకొనుచు
మంగళహారతుల మహిమవెలసి
శృంగారమైనట్టి మా శ్రీవేంకటాధిపు
డంగనలు కొలువగాను యిపుడు వేంచేసి 


ఓహో యెంతటివాఁడే - Oho Enthati Vade

ఓహో యెంతటివాఁడే వొద్దనున్నవాఁడే హరి
సాహసపు గుణముల చతురుఁడా యితఁడు

జలధిలోఁ బవళించి జలనిధి బంధించి
జల నిధి కన్యకను సరిఁ బెండ్లాడి
జలనిధిలో నిండి జలనిధి మథియించి
జలధి వెరించిన చలమరా యితఁడు

ధరణికిఁ బతియై ధరణి గ్రుంగిన నెత్తి
ధరణికూఁతురుఁ దానె తగఁ బెండ్లాడి
ధరణిఁ బాదము మోపి ధరణి భారము దించి
ధరణీ ధరుఁడైన దైవమా ఇతఁడు

కొండ గొడుగుగ నెత్తి కొండఁ దూఁటువడ నేసి
కొండకిందఁ గుదురై కూచుండి
కొండపై శ్రీ వేంకటాద్రి కోనేటిరాయఁడై
కొండ వంటి దేవుఁడైన కోవిదుఁడా ఇతఁడు