ఇద్దరి భావములును యెంచగ నలవిగావు
వొద్దికలై సింగారాలు వొడ్డినయట్లుండెను
వొద్దికలై సింగారాలు వొడ్డినయట్లుండెను
చెలువపు రమణుఁడు చెమట పైఁ జిమ్మితేను
జలజలఁ జెమరించి సకి యెట్లుండె
నెలవై లావణ్య జలధిలో స్వాతి వానచే
బలిసి ముత్యాల పంట వండినట్లుండెను
జలజలఁ జెమరించి సకి యెట్లుండె
నెలవై లావణ్య జలధిలో స్వాతి వానచే
బలిసి ముత్యాల పంట వండినట్లుండెను
సరసపు నాయకుఁడు జాజి మొగ్గలు వేసితే
తరుణి మైపులకించి తానెట్టుండెనే
మరిగి పాయపుచేన మన్మథాస్త్రపు మొలక
పొరి వసంతుఁడు చల్ల పొదలినట్లుండెను
తరుణి మైపులకించి తానెట్టుండెనే
మరిగి పాయపుచేన మన్మథాస్త్రపు మొలక
పొరి వసంతుఁడు చల్ల పొదలినట్లుండెను
శ్రీ వేంకటేశ్వరుఁడు చెంది మోవి యిచ్చితేను
యీ వనితమోము కళ యెట్టుండెనే
పోవులై మోహపు నిండుఁబున్న మనమృతముబ్బి
ఆవేళఁ జంద్రకళలానినయట్లుండెను
యీ వనితమోము కళ యెట్టుండెనే
పోవులై మోహపు నిండుఁబున్న మనమృతముబ్బి
ఆవేళఁ జంద్రకళలానినయట్లుండెను
తాత్పర్యము
(Meaning Courtesy - Patanjali Tadepalli garu)
అలమేల్మంగ , వేంకటేశ్వరుని భావములు ఎన్నుటకు సాధ్యము కావు.
అన్యోన్యములై ఒకదానికొకటి దీటుగా ఎదుర్కొనినట్లు ఉన్నవి
అందమైన ప్రియుడు చెమటను పైన చిమ్మితే
జలజల చెమరించి సఖి ఎట్లు ఉన్నది?
స్వాతి కార్తెలో కురిసిన వానచే అధికమైన ముత్యాల పంట పండినట్లున్నది
సరసపు నాయకుడు జాజి మొగ్గలు వేసితే, నాయిక శరీరము పులకించి తాను ఎలా ఉంటుంది?
యౌవనము అను చేనిలో వసంతుడు అను రైతు మన్మథునికి సంబంధించిన ఆయుధాల యొక్క లేత మొలకలను చక్కగా పెంచుటకు వెదజల్లగా కళకళలాడుచున్నట్లు ఉన్నది.
వేంకటేశ్వరుడు తన పెదవి ఆమెకు ఇస్తే , ఈ స్త్రీ ముఖపు కాంతి ఎలా ఉంటుంది?
మోహము అను నిండు పున్నమి వేళ , అమృతము పైకి ఉబికి చంద్రకళలను తాగినట్లు ఉన్నది.