Saturday, September 17, 2022

అదెచూడు తిరువేంకటాద్రి - AdeChoodu Tiruvenkatadri

అదె చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగము
లందు వెలుగొందీ ప్రభ మీరఁగాను

తగ నూటయిరువై యెనిమిది తిరుపతుల గల -
స్థానికులును చక్రవర్తి పీఠకములును
అగణితంబైన దేశాంత్రుల మఠంబులును
నధికమై చెలువొందఁగాను
మిగులనున్నతములగు మేడలును మాడుగులు
మితిలేని దివ్యతపసులున్న గృహములును
వొగి నొరగుఁ బెరుమాళ్ళవునికి పట్టయివెలయు -
దిగువతిరుపతి గడవఁగాను

పొదలి యరయోజనము పొడవుననుఁ బొలుపొంది
పదినొండు యోజనంబుల పరపుననుఁ బరగి
చెదరకే వంక చూచిన మహాభూజములు
సింహశార్దూలములును
కదిసి సురవరలు కిన్నరులు కింపురుషులును.....
గరుడ గంధర్వ యక్షులును విద్యాధరులు
విదితమై విహరించు విశ్రాంతదేశముల
వేడుకలు దైవారగాను

యెక్కువల కెక్కువై యెసఁగి వెలసిన పెద్ద-
యెక్కు డతిశయముగా నెక్కినంతటిమీఁద
అక్కజంబైన పల్లవరాయని మటము
అలయేట్లపేడ గడవన్
చక్కనేఁగుచు నవ్వచరిఁ గడచి హరిఁ దలఁచి
మ్రొక్కుచును మోకాళ్ళముడుగు గడచిన మీఁద-
నక్కడక్కడ వేంకటాద్రీశు సంపదలు
అంతంతఁ గానరాఁగాను

బుగులుకొను పరిమళంబుల పూవుఁదోఁటలును
పొందైన నానావిధంబుల వనంబులును
నిగిడి కిక్కిరిసి పండిన మహావృక్షముల-
నీడలను నిలిచి నిలిచి
గగనంబు దాఁకి శృంగార రసభరితమై -
కనకమయమైన గోపురములనుఁ జెలువొంది
జగతీధరుని దివ్యసంపదలు గల నగరు
సరుగననుఁ గానరాఁగాను

ప్రాకటంబైన పాపవినాశనములోని
భరితమగు దురితములు పగిలి పారుచునుండ
ఆకాశగంగ తోయములు సోఁకిన భవము
లంతంత వీఁడి పారఁగను
యీకడనుఁ గోనేట యతులుఁ బాశుపతుల్ మును-
లెన్న నగ్గలమైవున్న వైష్ణవులలో
యేకమై తిరువేంకటాద్రీశుఁడాదరిని
యేప్రొద్దు విహరించఁగాను 


Watch for Audio - https://youtu.be/Ou50CCCJLLs

లక్ష్మీకల్యాణము - Laxmi Kalyanamu

లక్ష్మీకల్యాణము లీలతోఁ బాడే మిదే నేము
లక్ష్మీనారాయణులే లలనయు నీవును

చూపులు చూపులు మీకు సూసకము బాసికము
పూపుచన్నుగుబ్బ లివి బూజగుండలు
తీపులమోవితేనెలు తీరని మధుపర్కములు
దాపుగఁ బెండ్లి యాడరయ్య తగుఁ దగు మీకును

మాటలుమీ కిద్దరికి మదనమంత్రములు
మేటితలంబ్రాలు మీలో మించు నవ్వులు
గాటమైన పులకలు కప్పురవసంతాలు
నీటునఁ బెండ్లాడరయ్య నెరవేరె మీకును

కౌఁగిలి కౌఁగిలి మీకు కందువ పెండ్లి చవికె
పాఁగిన కోరికలే పావ కోళ్లు
ఆఁగిన శ్రీవేంకటేశ అలమేలుమంగా నీవు
వీఁగక పెండ్లాడడయ్య వేడుకాయ మీకును 


Watch for Audio - https://youtu.be/QLMXoWrEBdc

అలమేలుమంగవు - Alamelumangavu

అలమేలుమంగవు నిన్నాతఁ డేమి యెఱఁగఁడా
యెలమి నీయెడ కాతఁ డిచ్చకుఁడేకదవే

తప్పక చూచినవాఁడు తగులకేలమానీనే
కప్పుర మిచ్చినవాఁడు కైకొనఁడటె
చెప్పి పంపినట్టివాఁడు చేరి యింటికి రాఁడటె
యిప్పు డింత విరహాన నేల పొరలేవే

వీడె మిచ్చినట్టివాఁడు వేడుకేల మరచీనే
వాడికైనవాఁడు నీకు వలవఁడటె
ఆడుకొలు మాఁటవాఁడు అన్నిటా లాలించఁడటె
యేడలేని తమకాన నేల పొలలేవే

ఆస కొలిపినవాఁడు అట్టె కాఁగిలించఁడటె
సేసవెట్టినట్టివాఁడు చెనకఁడటె
వాసెరిఁగి నిన్నుఁ గూడె వచ్చి శ్రీవేంకటేశుఁడు
యీ సుద్దికి నవ్వి నవ్వి యేల పొరలేవే 


Watch for Audio - https://youtu.be/4jaWXbdqfdg

Thursday, September 8, 2022

అహోబలేశ్వరుఁడు - Ahobaleswarudu

అహోబలేశ్వరుఁ డఖిలవందితుఁడు
మహి నితనిఁ గొలిచి మనుఁ డిఁక జనులు

మూఁడుమూర్తులకు మూలం బీతఁడు
వేఁడిప్రతాపపు విభుఁ డీతఁడు
వాఁడిచక్రాయుధవరధుఁ డీతఁడు
పోఁడిమిఁ బురాణపురుషుఁ డీతఁడు

అసురలకెల్లఁ గాలాంతకుఁ డీతఁడు
వసుధ దివ్యసింహం బితఁడు
విసువని యేకాంగవీరుఁ డీతఁడు
దెసలఁ బరాత్పరతేజం బితఁడు

నిగిడి శ్రీవేంకటనిలయుఁ డీతఁడు
బగివాయనిశ్రీపతి యితఁడు
సొగిసి దాసులకు సులభుఁ డీతఁడు
తగు నిహపరములదాతయు నీతఁడు 


Watch for Audio - https://youtu.be/GhbWTDokDvg

శరణాగతినే యెంచఁగ - Saranagatine Yenchaga

శరణాగతినే యెంచఁగ నిత్యులైరి గాక
పరమపురుష నీ పరికర మెల్లను

కర్మాచరణఁ గొని కలుగవు నీ వంటే
కర్మ మేమి సేయఁగాను కరిఁగాచితి
ధర్మతపమునఁ గాని తగులవు నీ వంటే
ధర్మమే మెఱుఁగునయ్య తగ నజామిడుఁడూ

వేదము చదివి నిన్ను వెదకి కనే మంటే
వేదమే మెఱుఁగు నీచవిధి గుహుఁడు
ఆదిమతమునఁ గాని అటు నిన్నుఁగాన మంటే
యే దెస ఘంటాకరుణ్మఁడే మతమువాఁడు

వర్ణాశ్రీమమునఁ గాని వడి నిన్నుఁ గనేమంటే
వర్ణా శ్రమము లేవి వాల్మీకికి
పూర్ణ శ్రీ వేంకట పురుషోత్తమ నిన్ను
వర్ణించి ఘనులైరి వరనారదాదులూ 


Watch for Audio - https://youtu.be/5dCqiAeRu0E

ఏమని కొనాడవచ్చు - Emani Koniyadavachu

ఏమని కొనాడవచ్చు నితనిచక్కఁదనము
మోము చూచినంతలోనే మోహింపించీ నితఁడు

మదనజనకుఁ కిట్టే మజ్జనమాడేటివేళ
కదిసి హస్తాలుఁ దానుఁ గారుకమ్ముచు
చదలఁ గడళ్ళతోడిసముద్రమె రూపై
యెదుట నిలుచున్నట్టు యిదె వున్నాఁ డీఁతడు

హరి కప్పురపుధూళి యలఁదుకొనినవేళ
సిరులు మించఁగను చూచినవారికి
అరిది శరత్కాలమందలితెల్ల నిమేఘ
మిరవై రూపై వున్న ట్టెన్నికాయ నీతఁడు

కావింపఁ బుళుగు వూసి కడునల్లనై సొమ్ముల
యీవల నలమేల్మంగ నెదఁ గట్టుక
కావిరి నింద్రనీలపుగనిరూపమై వుండినట్టు
శ్రీవేంకటేశ్వరుఁడు చెలువొందె నీతఁడు 


Watch for Audio - https://youtu.be/bVsO5i-MARs