Wednesday, June 1, 2022

హరిభక్తి గలిగితే - Haribhakti Galigite

హరిభక్తి గలిగితే అన్నియు ముఖ్యము గాక
విరసాచారము లెల్ల వృథావృథా

మిక్కిలి నీట మునిఁగే మీను కది స్నానమా
కొక్కెరధ్యానము సేసుకొరే అది యోగమా
నిక్కి మేక ఆకు మేయు నిండ నదే తపమా
చిక్కి తలకిందు వేలే జిబ్బడాయి సిద్ధుఁడా

పులులు గుహల నుంటే పోలింప ఋషులా
యెలువు గడ్డము వేచు నింతలోనే యోగ్యుఁడా
యిలఁబక్షు లాకాశాన కేఁగితే దేవతలా
వొలసి కోఁతి యడవి నుంటే వనవాసమా

మాకులు మాట లాడవు మౌనవ్రతములా
కోక గట్టను బాలులు కోరి దిగంబరులా
పై కొని శ్రీవేంకటేశు భక్తఁ డేమి సేసినాను
చేకొని లోకములోన చెల్లుబడులే 


Watch for Audio - https://youtu.be/tulV7lEives

No comments:

Post a Comment