Saturday, June 11, 2022

బలవంతుఁడవు నీవు - Balavantudavu Nivu

బలవంతుఁడవు నీవు పట్టినదే యీడేరును
యిల మీ దాసుఁడ నైతి యిఁకఁబోదు సుమ్మీ

స్వామి నాలోని చంచల గుణము లివి
యేమీ మానవు యెంతైనాను
నీ మాయ మహిమో నీకుఁ బరాకైనదో
నా మనసులోఁ గొంత నలుసున్నదో

దేవా పంచేంద్రియాలు తీదీపులనుఁ బెట్టే
నీవే నా యెదలోను నిండుకుండఁగా
యీవేళఁ దరిగాదో యిది నీ వినోదమో
నా వొళ్లి మంద బుద్ధి నయ మియ్యదో

అప్పా నేఁ దొల్లి అజ్ఞాని నైనదే
తప్పా నేఁడు గావ తగదా నన్ను
చెప్పే నామాట విను శ్రీ వేంకటేశ్వర నీకు
వొప్పినదే యాత్మ వొల్ల ననరాదు 

Watch for Audio - https://youtu.be/t2ymhDIeER0

చక్కఁదనములచేత - Chakkadanamulacheta

చక్కఁదనములచేత జవ్వన భారము చేత
యెక్కడౌటాఁ గానదిఁక నేమి సేతమే

ఒయ్యనె బంగారు తూఁగుటుయ్యాల మంచముమీఁద
పయ్యెద చెఱఁగు జారఁ బవ్వళించి
ముయ్యక మూసిన రెప్ప మూయుచుఁ దెరచుఁ గాని
నెయ్యమునఁ జూడనేరదేమి సేతమే

ముత్తేల గద్దియమీఁద ముద్దుల కురులు దూల-
నొత్తిలి యొకతె మీఁద నొరగుండి
చిత్తగించి చేతనున్న చెంగలువ బంతిఁ జెక్కు-
లొత్తుఁగాని మాటలొల్లదేమి సేతమే

కమ్మని తావులతోడ కన్నుల నవ్వులతోడ
చిమ్ముఁ జెమటలతోడఁ జెలువొంది
కొమ్మకు నేడుఁగలిగె కోనేటిరాయని పొందు
నెమ్మనము దాఁచ నేరదేమి సేతమే 


Watch for Audio - https://youtu.be/8faxf17_16Y

నీవంటిదైవాలు - Ni Vanti Daivalu

నీవంటిదైవాలు వేరీ నిఖిలలోకములందు
యీవల నావల నెందు నెంచి చూడ మాకును

తగిలి నీమోముచక్కఁదన మెంచి చూచితిమా
తగిన మరునిఁగన్న తండ్రివి నీవు
అగపడ్డనీగుణము లవి యెంచిచూచితిమా
నిగిడి కల్యాణగుణనిధివనీ శ్రుతులు

గుట్టు నీపెద్దతనము కులమెంచిచూచితిమా
అట్టె బ్రహ్మకులము నీయందుఁ బుట్టెను
దట్టపు నీపనులవర్తన మెంచి చూచితిమా
ముట్టి సర్వరక్షకత్వమున వెలసితివి

బెడిదమైననీబిరు దెంచిచూచితిమా
వడి శరణాగతవత్సలుఁడవు
కడఁగి శ్రీవేంకటేశ కంటిమి నీమహిమలు
బడి నిన్నే సేవించి బ్రదికితి మిదివో 


Watch for Audio - https://youtu.be/CisdtlIPGvs

Wednesday, June 1, 2022

హరిభక్తి గలిగితే - Haribhakti Galigite

హరిభక్తి గలిగితే అన్నియు ముఖ్యము గాక
విరసాచారము లెల్ల వృథావృథా

మిక్కిలి నీట మునిఁగే మీను కది స్నానమా
కొక్కెరధ్యానము సేసుకొరే అది యోగమా
నిక్కి మేక ఆకు మేయు నిండ నదే తపమా
చిక్కి తలకిందు వేలే జిబ్బడాయి సిద్ధుఁడా

పులులు గుహల నుంటే పోలింప ఋషులా
యెలువు గడ్డము వేచు నింతలోనే యోగ్యుఁడా
యిలఁబక్షు లాకాశాన కేఁగితే దేవతలా
వొలసి కోఁతి యడవి నుంటే వనవాసమా

మాకులు మాట లాడవు మౌనవ్రతములా
కోక గట్టను బాలులు కోరి దిగంబరులా
పై కొని శ్రీవేంకటేశు భక్తఁ డేమి సేసినాను
చేకొని లోకములోన చెల్లుబడులే 


Watch for Audio - https://youtu.be/tulV7lEives

ఏమనఁగలదిఁకఁ - Emana Galadika

ఏమనఁగలదిఁకఁ గాలము యింతయు విపరీతములై
భామినిదేహము పరితాపంబున వేఁగెడిని

కప్పురమియ్యని వీడెము గైకొనకొల్లని కాంతకు
కప్పురమంటిన చోట్లే కడుఁగడుఁ దొక్కెడిని
పుప్పొడివెన్నెల పొళ్ళు (?) పొలఁతికి వెన్నెల బాయిలు
నిప్పులఁ దోఁగినయట్లే నిలువునఁ గాఁగెడిని

పానుపు పువ్వులఁ బరవక పవళింపని సతి పూవులఁ
పానుపు కన్నులఁ జూచినఁ బరవశమందెడిని
లేనగవొదవని మాటలు లేనిలతాంగికి నగవులు
కానుకపట్టిన నొల్లక కన్నుల విసిగెడివి

కందర్పుని గురుఁడనఁగాఁ గలిగిన తిరువేంకటపతి - 
చందము చూపుల బామిని చనవున నొప్పెడిని
ఇందు వదనకే దేవుఁడు యింపులఁగడు మన్నించిన
కందువ పొలయలుకలఁ దమకమువడి రేఁపెడిని 


Watch for Audio - https://youtu.be/hWEmU8tUjhM

కలిమి గలిగియు - Kalimi Galigiyu

కలిమి గలిగియు నధమగతి యదేల
బలిమి గలిగియు లోఁగి బతిమాలనేల

ఇలువేలుపొకఁడు హరి ఇంటనే వుండఁగా
పలు వేలుపులతోడి భ్రమతలేల
మెలఁగి సూర్యుఁ డొక్కఁడు మిక్కిలిని వెలుఁగఁగా
వెల లేని దీపములు వేయి నేమిటికి

హరిభక్తి యొక్కటే ఆత్మలో నుండగా
పరయుక్తు లెంచేటి పనులేల
సిరులఁ జింతామణటు చేతిలో నుండఁగా
సరి గాజుఁబూస మెచ్చఁగ నదేమిటికి

నాలుకను మంచి హరినామ మొకటుండగా
గాలిఁ బోయెటి వూరగాథ లేల
యీలీల శ్రీవేంకటేశుఁ డెదుటనె వుండగా
మూలలకుఁ జేచాఁచి మొక్క నిఁకనేలా 


Watch for Audio - https://youtu.be/4KogWmZG88c

చిత్తజుని మోహపు - Cittajuni Mohapu

చిత్తజుని మోహపుశృంగారవనమో యీకె
పొత్తుల వసంతమాడే పురుషునితోడను

పాయము మోసులువారెఁ బడఁతికుచములను
చాయవలపు కన్నుల జాజుకొనెను
చేయివాలెఁ గోరికలు చిగురులకొనగోళ్ళ
యీయెడ విభునివద్ద నింతిఁ జూడరమ్మా

కొప్పునఁ గొనలుసాగెఁ గోమలితమకములో
కప్పురపుమాటలను గర్వము వూచెను
పుప్పొడి రాలె సెలవిఁ బొలఁతికి సిగ్గులనె
చెప్పరాదు పానుపుపై చెలియభావములు

భావరతి పంటపండె భామినిబింబపు మోవి
కైవశమై రాసికెక్కెఁగళలెల్లాను
యీవేళ శ్రీ వేంకటేశుఁ డింతియుఁ గూడఁగాను
దేవిదేవరవలె దిష్టమాయ నిదివో 


Watch for Audio - https://youtu.be/lQ0fYDUCv_M

వేదం బెవ్వని - Vedam Bevvani

వేదం బెవ్వని వెదకెడిని
ఆదేవునిఁ గొనియాడుఁడీ

అలరిన చైతన్యాత్మకుఁ డెవ్వఁడు
కలఁ డెవ్వఁ డెచటఁ గలఁడనిన
తలఁతు రెవ్వనినిఁ దనువియోగదశ
యిల నాతని భజియించుఁడీ

కడఁగి సకలరక్షకుఁడిం దెవ్వఁడు
వడి నింతయు నెవ్వనిమయము
పిడికిట తృప్తులు పితరులెవ్వనినిఁ
దడవిన, ఘనుఁడాతనిఁ గనుఁడీ

కదిసి సకలలోకంబులవారలు
యిదివో కొలిచెద రెవ్వనిని
త్రిదశవంద్యుఁడగు తిరువేంకటపతి
వెదకి వెదకి సేవించుఁడీ 


Watch for Audio - https://youtu.be/k5mjx1MUvXU