Saturday, March 22, 2025

ఏది యిందులో సుఖము - Yedi Indulo Sukhamu

ఏది యిందులో సుఖ మెవ్వరు మంచివారలు
పాదు దెలియని ప్రాణిభ్రమ యింతే కాక

భోగింపుచు పిండి పిండి పూచి రక్తమాంసము
లాగతిఁ బుత్రదారాదు లలయింతురు
చేగదేర వెట్టిగొనే చేతుల యిడుమలెల్ల
సాగిన సభలలోన సంసారము

వుఱక మేనిలోఁ జొచ్చి వొగి నింద్రియాల కేఁచి
అఱమఱపించఁ జచ్చె నన్నపానములు
యెఱిఁగెఱిఁగి యుండగా నేలినవాని కమ్మించె
తఱిఁ దనజన్మ మెల్ల ధనధాన్యములు

వొప్పి గుఱిగాక వూరకున్నవాని నతిథుల
కప్పన మప్పించెను గృహారామములు
యిప్పుడే శ్రీవేంకటేశుఁ డేలి మమ్ముఁ గాచెఁ గాక
పుప్పిగాఁ దినె నిన్నాళ్ళు పుణ్యపాపములు 

Watch for audio - https://youtu.be/mDNXwrinuFs

నీ వెఱఁగవా నిండుఁ - Ni Veragava Nindu

నీ వెఱఁగవా నిండుఁ దగవు లివి
కావరంపుఁబని కాంతకుఁ దగునా

నిగ్గుల పతి వట నెలఁతను నే నట
సిగ్గువడక నినుఁ జెనకుదునా
యెగ్గులు వట్టితి వెదురురాననుచు
బగ్గన నాఁటది బలిమిసేయునా

చదురుల దొర వట జవ్వని నే నట
అదనెఱఁగక నిను నలముదునా
కదిమి కొసరితివి గర్వినైతి నని
గుదిగొని కామిని గొరబుసేతునా

శ్రీవేంకటేశ్వర శ్రీసతి నేనట
సోవగా నవ్వక సొలయుదునా
యీవలఁ గూడితి వియ్యకొంటి నని
కైవసమగు సతి కాదనునా 

Watch for audio - https://youtu.be/EMLwSG8FYlw 

కాలాంతకుఁడను - Kalantakudanu

కాలాంతకుఁడనువేఁటకాఁ డెప్పుడుఁ దిరిగాడును
కాలంబనియెడితీవ్రపుగాలివెర వెరిఁగి

పరమపదంబు చేనికి పసిగొనునర మృగములకు నును
తరమిడి, సంసారపుటోఁదములనె యాఁగించి,
వురవడిఁ జేసినకర్మపుటరులు దరిద్రంబనువల
వొరపుగ మాయనుపోగులు వొకవెరవున వేసీ

కదుముకవచ్చేటిబలురోగపుఁగుక్కల నుసికొలిపి,
వదలక ముదిసినముదిమే వాకట్టుగఁ గట్టి.
పొదలుచు మృత్యువు పందివోటై నల్లెట నాడఁగ.
పదిలముగా గింకరులనుచొప్పరులఁ బరవిడిచీ

ఆవోఁదంబులఁ జిక్కక, ఆవురులనుఁ దెగనురికి,
ఆవేఁటకాండ్ల నదలించాచేనే చొచ్చి ,
పావనమతిఁ బొరెవొడిచి పరమానందముఁ బొందుచు
శ్రీ వేంకటపతి మనమునఁ జింతించీ నరమృగము 

Watch for audio - https://youtu.be/OO_ClhxoB6Y

ఎవ్వ రెరుఁగుదురమ్మా - Evva Reruguduramma

ఎవ్వ రెరుఁగుదురమ్మా యిటువంటి నీ సుద్దు –
లివ్వల నేఁ డప్పటి మా యింటికి వచ్చితివి

కలికితనములనే కరఁగించితివి పతి
సెలవి నవ్వులు నవ్వి చిమ్మిరేఁచితి
మలకల మాఁటలాడి మరిగించుకొంటివి
యెలమి నీతని నింకా నేమి సేతువో

చేతులెత్తి మొక్కి మొక్కి చేతికి లోఁ జేసితివి
యేతులెల్లాఁ జూపి చూపి యెలయించితి
కాతరానఁ గాలు దొక్కి కడుఁ జోకఁ జేసితివి
యీతల నీతని నింకా నెంత సేతువో

సన్నల నీ మోవినే చవులు గొలిపితివి
పన్నుక చెనకులనే భ్రమయించితి
యిన్నిటా శ్రీవేంకటేశుఁ డీతఁ డిట్టె నన్నుఁ గూడె
యెన్నిక చేఁతల నీవు యెంత సేతువో 

Watch for audio - https://youtu.be/07bRUq0HwJA

ఎన్నిలేవు నాకిటువంటివి - YenniLevu Naa Kituvantivi

ఎన్ని లేవు నా కిటువంటివి
కన్నులెదుట నిన్నుఁ గనుగొనలేనైతి

అరయ నేఁజేసినయపరాధములు చూచి
కరుణించి వొకడైనాఁ గాచునా
కరచరణాదులు కలిగించిననిన్నుఁ
బరికించి నీసేవాపరుఁడ గాలేనైతి

యేతరినై నేనెఱిఁగి సేసినయట్టి-
పాతక మొకఁడైనా బాపునా
ఆతుమలోనుండి యలరి నీవొసఁగిన-
చేతనమున నిన్నుఁ జెలఁగి చేరనైతి

శ్రీవేంకటేశ నేఁ జేసినయితరుల-
సేవ కొకఁడు దయసేయునా
నీవే యిచ్చినయట్టి నే నీశరీరముతోడ
నీవాఁడ ననుబుద్ధి నిలుపనేరనైతి 

Watch for audio - https://youtu.be/QgXuKNxxgeM

Thursday, March 13, 2025

మొక్కేమయ్యా నీకు - Mokkemayya Neeku

మొక్కేమయ్యా నీకు ముమ్మాటికి
యెక్కువతక్కువల నిన్నేమి సేసితిమో

విరహతాపముచేత విసిగినవేళ నిన్ను
యెరవుగా జూచి చూచి యే మాడితినో
తరలక నీవు నన్ను దగ్గరి కాగిలించితే
కరఁగినవేళ యెట్టు కాలు చేయి దాఁకునో

జవ్వనమదము చేత జడిసిన వేళ నిన్ను
యివ్వల నే నెంత రచ్చ కెక్కించితినో
నవ్వుతా నీవంత నాకు నీమో వియ్యఁగాను
యెవ్వల నీ కేడేడ నా యెంగి లాయనో

పానుపుపై నిద్దరము పవ్వ ళించేవేళ నిన్ను
పూని యంత యలయించి భోగించితినో
ఆనుక శ్రీవేంకటేశ అలమేలుమంగను న
న్నీ నెపానఁ గూడితివి యెట్లా మీరితినో 

Watch for audio - https://youtu.be/Zlx9m5DBf-A