Saturday, February 15, 2025

తనకేడ చదువులు - Tanakeda Chaduvulu

తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు
మనసు చంచలబుద్ధి మానీనా

జడ్డుమానవుఁడు చదువఁజదువ నాస
వడ్డివారుఁగాక వదలీనా
గుడ్డికుక్క సంతకుఁబోయి తిరిగిన
దుడ్డుపెట్లేకాక దొరకీనా

దేవదూషకుఁడై తిరిగేటివానికి
దేవతాంతరము తెలిసీనా
శ్రీవేంకటేశ్వరుసేవాపరుఁడుగాక
పావనమతియై పరగీనా 

Watch for audio - https://youtu.be/IUNa1fvL6_I 

ఎరుక చెప్పే నీయిచ్చ - Eruka Cheppe Ni Icha

ఎరుక చెప్పే నీయిచ్చ యెల్లానెరుఁగుదు
మెరుఁగైన సొమ్ములిచ్చి మెచ్చవయ్య నన్ను

చేతికి కల పలము చెప్పే రావయ్య నీకు
ఘాతలఁ బరాంగనలఁ గాఁగిలింతువు
ఈతలఁ గన్నులమేలిటు చెప్పే రావయ్య
సూతకపుమానములు (?) చూడఁగలదిఁకను

మోవిలక్షణాలు నీకు మోవఁజెప్పే రావయ్య
చావనొక్కరాకాసిచన్ను దాగితి
వావిరి నీపాదముల వ్రాఁతల జయము చెప్పే
బావిమడుగుననొక్క పాముఁ దొక్కితివి

ఇంగితాకారపుభాగ్యమిటు చెప్పే నీవురాన
నంగన మోహించి పాయకయున్నది
తంగని శ్రీ వేంకటేశ తలఁపు చెప్పే నన్నుఁ
బొంగుచుఁ గూడి యిట్టె పోననేవయ్యా

Watch for audio - https://youtu.be/spNJGAdQuJI

సకలజీవులకెల్ల - SakalaJeevulakella

సకలజీవులకెల్ల సంజీవి యీమందు
వెకలులై యిందరు సేవించరో యీమందు

మూఁడులోకము లొక్కట ముంచి పెరిగినది
పోఁడిమి నల్లనికాంతిఁ బొదలినది
పేఁడుక కొమ్ములు నాల్గు పెనచి చేయివారినది
నాఁడే శేషగిరిమీద నాఁటుకొన్నమందు

పడిగెలు వేయింటిపాము గాచుకున్నది
కడువేదశాస్త్రముల గబ్బు వేసేది
యెడయక వొకకాంత యెక్కుక వుండినది
కడలేనియంజనాద్రిగారుడపుమందు

బలుశంఖుజక్రములబదనికె లున్నది
తలఁచినవారికెల్లఁ దత్వమైనది
అలరినబ్రహ్మరుద్రాదులఁ బుట్టించినది
వెలుఁగుతోడుత శ్రీవేంకటాద్రిమందు

Watch for audio - https://youtu.be/TzG8OW5siT0 

సేసినట్టె వానిఁ జేయనీరే - Sesinatte Vani

సేసినట్టె వానిఁ జేయనీరే 
మాసటీనివంటిమంకువాఁడే 

పట్టగఁబట్టగఁ బాముతల దొక్కె 
యిట్టిపిన్నవాని నేమందమే 
తిట్టగఁదిట్టగఁ దినె వెన్నలెల్ల 
బట్టగుత్తుచలపాదివాఁడే 

కూయఁగఁగూయఁగఁ  గోకలు దొంగిలె 
వోయమ్మ వీఁడెంత వుద్దండీడే 
తోయఁగఁదోయగ దుండగములు సేసె 
చేయిమీదయినట్టిసీటవాఁడే 

చెప్పఁగఁజెప్పఁగఁ  జేతఁ  గొండ యెత్తె 
అప్పుడే  శ్రీవేంకటాద్రీశుఁడే 
కప్పగఁగప్పఁగఁ గలసె నింతుల 
అప్పఁ డలమేల్మంగాధిపుడే

Watch for audio - https://youtu.be/MLYD04UG5og 

అనుచు లోకములెల్ల - Anuchu Lokamulella

అనుచు లోకములెల్ల నదె జయవెట్టేరు
నినుఁ గొల్చితిఁ గావవే నీరజాక్షుఁడా

అదివో కోనేటిలోన నదివో సర్వతీర్థములు
అదివో పైఁడిమేడలహరినగరు
పొదలి పరుషలెల్లా పొదిగి సేవించేరు
యిదివో వరములిచ్చె నిందిరానాథుఁడు

అదివో వేదఘోషము అదివో సురలమూఁక
అదివో విశ్వరూపము అద్భుతమందె
గుదిగొనెఁ బుణ్యములు కోట్లసంఖ్యలు చేరె
యిదివో దయదలఁచె నీశ్వరేశ్వరుఁడు

అదివో శ్రీవేంకటేశుఁ డక్కున నలమేల్మంగ
అదివో నిత్యశూరులు ఆళువారలు
నిదుల శేషాచలము నిక్కి పైపైఁ బొడచూపె
యిదివో కొలువున్నాఁడు హృదయాంతరాత్ముఁడు

Watch for audio - https://youtu.be/799_58JykTQ 

అనంతమహిముఁడవు - Ananta Mahimudavu

అనంతమహిముఁడవు అనంతశ క్తివి నీవు
యెనలేనిదైవమా నిన్నేమని నుతింతును

అన్నిలోకములు నీయందు నున్న వందురు నీ-
వున్నలోక మిట్టిదని వూహించరాదు
యెన్న నీవు రక్షకుఁడ విందరిపాలిటికి
నిన్ను రక్షించేటివారి నేనెవ్వరి నందును

తల్లివి దండ్రివి నీవు తగు బ్రహ్మాదులకు
యెల్లగా నీతల్లిదండ్రు లెవ్వరందును
యిల్లిదె వరములు నీ విత్తు విందరికిని
చెల్లఁబో నీకొకదాత చెప్పఁగఁ జోటేది

జీవుల కేలికవు శ్రీవేంకటేశుఁడవు నీ-
వేవలఁ జూచిన నీ కేయేలికే లేఁడు
వేవేలు మునులును వెదకేరు నిన్నును
నీ వెవ్వరి వెదకేవు నిర్మలమూరితివి

Watch for audio - https://youtu.be/0DZwSIAnBSw