Saturday, December 28, 2024

శ్రీపతి యీతఁడుండగాఁ - Sripati Eetadundaga

శ్రీపతి యీతఁడుండగాఁ జిక్కినవారి నమ్ముట
తీపని మీసాలమీఁది తేనె నాకుటసుండీ

తలఁచినంతటిలోనె దైవ మెదుటఁ గలఁడు
కొలువనేరనియట్టి కొరతే కాని
ఇల నరులఁ గొలుచు టెందో కోకలు వేసి
బలుకొక్కెరలవెంటఁ బారాడుటసుండీ

శరణన్నమాత్రమున సకలవరము లిచ్చు
నిరతి మరచినట్టినేరమే కాని
పోరి నితరోపాయానఁ బొరలుట గాజుఁబూస
గరిమ మాణికమంటాఁ గట్టుకొంటసుండీ

చేత మొక్కితేఁ జాలు శ్రీవేంకటేశుఁడు గాచు
కాతరాన సేవించనికడమే కాని
యీతల నిది మాని మరెన్నిపుణ్యాలు సేసినా
రీతి నడవిఁగాసినరిత్తవెన్నెలసుండీ 

Watch for audio - https://youtu.be/GvklZxZMWps 

దాసోహ మనుబుద్ధిఁ - Dasoha manubudhi

దాసోహ మనుబుద్ధిఁ దలచరు దానవులు
యీసులకే పెనఁగేరు యిప్పుడూఁ గొందరు

హరిచక్రము దూషించేయట్టివారే యసురలు
అరయఁ దామేదైవమన్నవారు నసురలే
ధర నరకాసురుడు తానె దైవమని చెడె
యిరవై యిది మానరు యిప్పుడూఁ గొందరు

పురుషోత్తముని పూజపొంతఁ బోరు అసురలు
సరవి విష్ణుని జపించనివారు నసురలే
హిరణ్యకశిపుఁడును యీతని నొల్లక చెడె
ఇరవై యీతని నొల్ల రిప్పుడూఁ గొందరు

సురలును మునులును శుకాది యోగులును
పరమము శ్రీవేంకటపతి యనుచు
శరణని బ్రదికేరు సరి నేఁడు వైష్ణవులు
యెరపరికానఁ బొయ్యే రిప్పుడూఁ గొందరు 

Watch for audio - https://youtu.be/VAa4jMh7Dw4 

కేరక మా చీర లీవోయి - Keraka Ma Chiralevoyi

కేరక మా చీర లీవోయి కృష్ణరాయ వే
గీర లేడవోయి నీకు కృష్ణరాయ

కే లెత్తి మొక్కేమయ్య కృష్ణరాయ మా
కీలు నీచేత నున్నది కృష్ణరాయ
గేలిసేసే వేల మమ్ముఁ గృష్ణరాయ నీకు
కేళికాయ మా సిగ్గులు కృష్ణరాయ

గిరగిర గోర గీరే కృష్ణరాయ మాకుఁ
గెరలించేవు వలపు కృష్ణరాయ
గిరికుచము లివిగో కృష్ణరాయ నీకు
గిరవు లెట్టు కుందాన కృష్ణరాయ

గెలిచితి విందరిని కృష్ణరాయ మమ్మీ
కెలఁకులఁ గూడితివి కృష్ణరాయ
కెలయకు వెన్నముద్ద కృష్ణరాయ మి
క్కిలి శ్రీవేంకటాద్రిపై కృష్ణరాయ 

Watch for audio - https://youtu.be/RQ3Um28S6Wg 

అనరాదు వినరాదు - Anaradu Vinaradu

అనరాదు వినరాదు ఆతనిమాయలు నేఁడు
దినదిన క్రొత్తలాయ ద్రిష్టమిదే మాకు

ఆడెడిబాలుల హరి అంగిలిచూపుమని
తోడనే వాండ్లనోర దుమ్ములు చల్లి
యీడ మాతోఁ జెప్పగాను యిందరముఁ గూడిపోయి
చూడఁబోతే పంచదారై చోద్యమాయనమ్మా

తీఁటతీగెలు సొమ్మంటా దేహమునిండా గట్టె
తీఁటకుఁ గాక బాలులు తెగి వాపోఁగా
పాటించి యీసుద్ది విని పారితెంచి చూచితేను
కోటికోటి సొమ్ములాయ కొత్తలోయమ్మా

కాకిజున్ను జున్నులంటా గంపెఁడేసి తినిపించి
వాకొలిపి బాలులెల్ల వాపోవఁగా
ఆకడ శ్రీవేంకటేశుఁ డాబాలుల కంటినీరు
జోకగ ముత్యాలు సేసెఁ జూడఁగా నమ్మా 

Watch for audio - https://youtu.be/hEigUwKnw-Q 

పుట్టినమొదలు నేను - Puttina Modalu Nenu

పుట్టినమొదలు నేను పుణ్యమేమీఁ గాననైతి
యెట్టు గాచేవయ్య నన్ను యిందిరానాథా

కామినులఁ జూచిచూచి కన్నులఁ గొంతపాపము
వేమరు నిందలు విని వీనులఁ గొంతపాపము
నామువారఁ గల్లలాడి నాలికఁ గొంతపాపము
గోమునఁ బాపము మేనఁ గుప్పలాయ నివిగో

కానిచోట్లకు నేఁగి కాఁగిళ్ళఁ గొంతపాపము
సేన దానాలందుకొని చేతులఁ గొంతపాపము
మానని కోపమే పెంచి మతిఁ గొంతపాపము
పూని పాపములే నాలోఁ బోగులాయ నివిగో

చేసినట్టివాఁడఁగాన చెప్ప నీకుఁ జోటులేదు
దాఁసుడ నే నైతిఁ గొన దయదలఁచితివయ్య
యీసరవులెల్లఁ జూచి యేమని నుతింతు నిన్ను
ఆసల శ్రీవేంకటేశ ఆయఁబోయఁ బనులు 

English Lyrics
============ 
Puttinamodalu nenu punyamemi gaananaiti
Yettu gachevayya nannu Indiraanatha 

Kaminula  juchichuchi kannula  gontapapamu
Vemaru nindalu vini veenula  gontapapamu
Namuvaara  gallaladi naalika  gontapapamu
Gomuna  bapamu mena  guppalaya nivigo 

Kaanichotlaku negi kaagilla gontapaapamu
Sena danalandukoni chetula  gontapapamu
Maanani kopame penchi mati  gontapapamu
Pooni papamule nalobogulaya nivigo  

Chesinattivadagana cheppa niku  jotuledu
Daasuda ne naithi  gona dayadalachitivayya
Yisaravulella  juchi yemani nutintu ninnu
Asala Sri Venkatesha Ayaboya  banulu 

Watch for audio - https://youtu.be/ZHROpxBLSzU 

చెలఁగి కొలువులోన - Chelagi Koluvulona

చెలఁగి కొలువులోన సిగ్గులువడఁగవద్దా
బలువుఁడవైతేనే ప్రహ్లాదవరదా

వడియుఁ జెమటతోడ వంచినమోముతోడ
తొడమీఁదఁగూచున్న తొయ్యలితోడ
జడిసేనీవలపులు సరికి బేసికిఁజూచి
పడఁతులెల్లా నవ్వేరు ప్రహ్లాదవరదా

నిట్టూరుపులు మీర నిద్దుర గన్నులఁ దేర
గుట్టుతో విన్నాపె గోర గీర
గట్టిగా నీవాపెను కాఁగిలించి వదలక
పట్టుకుండఁగా నవ్వేరు ప్రహ్లాదవరదా

సింగపుమోము మెఱయ చిమ్ముఁజూపులుబెరయ
అంగన కాఁగిట నొయ్యన దొరయ
రంగుగ శ్రీవేంకటాద్రిరాయఁడవై మన్నించఁగా
పంగెనల నవ్వేరు ప్రహ్లాదవరదా 

Watch for audio - https://youtu.be/Bst8K3ydPw8 

కనుఁగొని మొక్కరే - Kanugoni Mokkare

కనుఁగొని మొక్కరే కాంతలాల
వొనరి యిందరితోడ నున్నాఁడు దేవుఁడు

చిప్పిల నదివో రతిచెమటలఁ దొప్పఁదోఁగి
కప్పురదూళి మేనఁ గడుఁజాతి
దప్పిదేరి చెంగలువదండల చప్పరములో
వుప్పతిల్ల వలపుల నోలలాడీ దేవుఁడు 

గుట్టున మిక్కిలిపెనఁగులాటనే యలసి
తట్టుపుణుఁగు మేన నంతటా నలఁది
వట్టివేళ్ళ సురట్ల వాసన సేదదేరి
వొట్టుకొని వేడుకల నోలలాడీ దేవుఁడు 

పలుమారు నవ్వులలో పంతములనే మెరసి
మెలుపున సొమ్ములెల్ల మేన ధరించి
అలమేలుమంగ నురమందుఁ గాఁగిలించుకొని
వొలిసి శ్రీవేంకటాద్రి నోలలాడీ దేవుఁడు 

Watch for audio - https://youtu.be/6914I2vghcs 

ఇందుకా కోరి పుట్టె - Indukaa Kori Putte

ఇందుకా కోరి పుట్టె యిట్టిబదుకు
పొందుల శ్రీహరితోడిపొత్తుల మాబదుకు

బడబాగ్ని ఆఁకటిబారిఁబడ్డ బ్రదుకు
పడఁతులకూటములఁ బడ్డబదుకు
వొడలి తోలినెమ్ముల వొడిగట్టేబదుకు
బడిఁ బుణ్యపాపాలపై తరవు బదుకు

నాలుక గడచితేను నరకపుబదుకు
మూలమలమూత్రాల మూటగట్టేబదుకు
కాలము నడిపి వూర్పుగాలిఁబుచ్చే బదుకు
పాలుమాలే యింద్రియాల పంగెమాయె బదుకు

ఇంపు సుఖదుఃఖాల యెండనీడ బదుకు
మంపుఁ గామక్రోధాలమాటు బదుకు
జంపుల శ్రీవేంకటేశుశరణు చొరఁగ నేఁడు
సొంపు లిన్నిటా మాకు సుఖమాయ బదుకు 

Watch for audio - https://youtu.be/CYIVCI9jVww 

మాయింటికి విచ్చేసిన - Maintiki Vichesina

మాయింటికి విచ్చేసిన మన్నన యిది చాలదా
యేయెడనుండివచ్చిన నెరవుసేసేమా

కప్పురపుఁ జూపులు ఆకాంత నీపైఁ జల్లఁగాను
వుప్పతిల్ల వెన్నెల నవ్వులు చల్లేవు
చప్పుడుసేయక యింకఁ జల్లఁగా బదుకరయ్య
యెప్పుడు నీవారమె నే మెరవుసేసేమా

వేడుకమాటల నాపె విందునీకుఁ బెట్టఁగాను
యీడనె వలపుసొమ్ము లియ్యఁ జూచేవు
యీడుజోడుగూడుక మీరిద్దరు బదుకరయ్య
యేడసుద్ది మిమ్ము నేము యెరవుసేసేమా

అలమేలుమంగ నీకు నాసలుగానుకియ్యఁగ
కలిమి శ్రీవేంకటేశ కప్ప మిచ్చేవు
మెలఁగి వొకరొకరు మీ రిట్టె బదుకరయ్య
యెలమి నన్నుఁ గూడితి వెరవుసేసేమా 

Watch for audio - https://youtu.be/Mvwt2JQHiJ0 

కొలనిదోఁపరికి గొబ్బిళ్ళో - Kolanudopariki Gobbillo

కొలనిదోఁపరికి గొబ్బిళ్ళో యదు-
కులము స్వామికిని గొబ్బిళ్ళో

కొండ గొడుగుగా గోవులఁ గాచిన
కొండుక శిశువుకు గొబ్బిళ్ళో
దుండగంపు దైత్యులకెల్లను తల-
గుండు గండనికి గొబ్బిళ్ళో

పాపవిధుల శిశుపాలుని తిట్ల-
కోపగానికిని గొబ్బిళ్ళో
యేపునఁ గంసుని యిడుమలఁ బెట్టిన-
గోపబాలునికి గొబ్బిళ్ళో

దండి వైరులను తఱమిని దనుజుల-
గుండె దిగులునకు గొబ్బిళ్ళో
వెండిఁ బైఁడియగు వేంకటగిరిపై
కొండలయ్యకును గొబ్బిళ్ళో 

Watch for audio - https://youtu.be/tViJRgR_vTo 

ఇతరులకు నిను నెరుగతరమా - Itarulaku Ninu Nerugatarama

ఇతరులకు నిను నెరుగతరమా 
సతత సత్యవ్రతులు సంపూర్ణమోహవిర-
హితు లెఱుగుఁదురు నినునిందిరారమణా

నారీకటాక్షపటు నారాచభయరహిత-
శూరులెఱుఁగుదురు నినుఁ చూచేటి చూపు
ఘోరసంసార సంకులపరిచ్ఛేదులగు-
ధీరులెఱుఁగుదురు నీదివ్యవిగ్రహము

రాగభోగవిదూరరంజితాత్ములు మహా-
భాగు లెరుఁగుదురు నినుఁ బ్రణుతించువిధము
ఆగమోక్త ప్రకారాభిగమ్యులు మహా-
యోగులెఱుఁగుదురు నీవుండేటివునికి

పరమభాగవత పదపద్మసేవానిజా-
భరణులెఱుఁగుదురు నీ పలికేటిపలుకు
పరగు నిత్యానంద పరిపూర్ణ మానస-
స్థిరు లెఱుఁగుదురు నినుఁ దిరువేంకటేశ 

Watch for audio - https://youtu.be/KJ24U9d3An4 

జయ జయ నృసింహ - Jaya Jaya Nrusimha

జయ జయ నృసింహ సర్వేశ
భయహర వీర ప్రహ్లాదవరద

మిహిరశశినయన మృగనరవేష
బహిరంతస్థలపరిపూర్ణ
అహినాయకసింహాసనరాజిత
బహుళగుణగుణ ప్రహ్లాదవరద

చటులపరాక్రమ సమఘనవిరహిత
నిటలనేత్ర మౌనిప్రణుత
కుటిలదైత్యతతికుక్షివిదారణ
పటువజ్రనఖ ప్రహ్లాదవరద

శ్రీవనితాసంశ్రిత వామాంక
భావజకోటిప్రతిమాన
శ్రీవేంకటగిరిశిఖరనివాస
పావనచరిత ప్రహ్లాదవరద 

Watch for audio - https://youtu.be/zphVvOv8ioA 

వెలఁది సింగారము - Veladi Singaramu

వెలఁది సింగారము వింత వింత బాగులాయ
చెలువపు విభుఁడవు చిత్తగించవయ్యా

తేఁటులు పువ్వులుండిన చోటికి వచ్చుఁగాక
తేఁటులలోఁ బువ్వులెట్టు తిరమాయను
గాఁటపు చందురురాక కలువలు గోరుఁగాక
వాఁటమై చంద్రునిలోఁ గల్వలు తావుకొనునా

చివ్వనను సంపెంగ చిగురుపై బూచుఁగాక
పువ్వుకొనఁ జిగురు దాపుగనుండునా
వువ్విళ్ళూరఁ గొండలపై నుండుఁగాక సింహము
కొవ్వు మీరి సింహము కొండలుదామోచునా

అల మరుతేరిపైనంపపోదులుండుఁ గాక
అలరుల పొదులు తేరునందు గలవా
బలిమి నీలానకు బంగారు గమ్యౌఁగాక
నెలవై శ్రీ వేంకటేశ నీలము గమ్యౌనా 

Watch for audio - https://youtu.be/ONDfkLs26Xc 

ఇంతట నిట్టె విచ్చేసి - Intata Nitte Vichesi

ఇంతట నిట్టె విచ్చేసి యింతిఁ గూడితేఁ గనక
వంతుకు నిన్ను జాణదేవర వనవచ్చును

తనలోనె తలపోసి తప్పక చూచేవేళ
వనితను దేవగన్య యనవచ్చును
పనివి నిన్నుఁ దలఁచి పాటలు వాడేవేళ
అనుగు గంధర్వకాంత యనవచ్చును

చలపట్టి విరహాన జలకేళి సేయువేళ
అలివేణి నాగకన్య యనవచ్చును
చలువకుఁ జంద్రకాంత శిలపైఁ బొరలువేళ
అలరిన చంద్రకన్య యనవచ్చును

శ్రీ వేంకటేశ నీవు చెలియఁ గూడినవేళ
ఆవటించి నిజలక్ష్మీ యనవచ్చును
వోవల నీ సోమ్ములలో వురమున మోచువేళ
దేవి యలమేలుమంగ దిష్ట మనవచ్చును 

Watch for audio - https://youtu.be/iGBwLsvltEE 

కలగన్నచోటికిని - Kalaganna Cotikini

కలగన్నచోటికిని గంప యెత్తిన యట్లు
అలవు మీఱినదెట్లనమ్మా

ఎలయింపుఁ గడకంట నెన్నఁడో వొకనాఁడు
చెలఁగి తను నతఁడు చూచినవాఁడట
పొలిఁతి యదిదలఁచి యిప్పుడు మదనవేదనల-
నలసీ నిఁకనెట్లనమ్మా

ఎఱుకయును మఱపుగా నేఁటికో వొకనాఁడు
కెఱలి తను నొవ్వఁ బలికినవాఁడట
తఱినదియె చెలి యిపుడు దలఁచి పరితాపాగ్ని-
నఱగీ నిఁకనెట్లనమ్మా

ఇయ్యకోలుగఁ గలసి యెప్పుడో యిదెనేఁడు
నెయ్యమున చెలిలోన నెలకొనెనట
తియ్యముల సటకాఁడు తిరువేంకటేశ్వరుఁడు
అయ్యో యిఁకనెట్లనమ్మా 

Watch for audio - https://youtu.be/0ihADPmx4O0 

హరి నీవు మాలోన - Hari Nivu Malona

హరి నీవు మాలోన నడఁగు టరదుగాక
శరణని నీకు నే జయ మందుటరుదా

పాపపుణ్యలంపటమైనది మేను
కూపపు యోనులఁ గుంగేటిది మేను
దీపనాగ్నిగల దిష్టము యీమేను
మోపు మోచిన నేము ములిగేది యరుదా

పొలసి పొద్దొకచాయఁ బొరలేటిమనసు
కొలఁదిలేని యాసఁ గుదురైన మనసు
మలసి సంసారమేమరిగిన మనసు
కలనేము, తిమ్మటలు గైకొనేది యరుదా

పెనచి యింద్రియములఁ బేఁడినభవము
పనివడి చింతలకే పాలైనభవము
యెనలేని శ్రీవేంకటేశ నీకే శరణని
మనెఁ గాన యిఁక మీఁద మంచిదౌటరుదా 

Watch for audio - https://youtu.be/OlsueAIlTaI 

అట్టె బదుకవయ్యా - Atte Badukavayya

అట్టె బదుకవయ్యా అంతలోనే మాకేమి
ఇట్టె వలపే నీకు యెక్కువసింగారమా

మాయదారివాఁడవు మానినులవుంగరాలు
యీయెడ వెళ్లఁబెట్టుక యెమ్మెసేసేవు
చాయలమేనిరేఖలు చాలవా అందుకుఁదోడు
కాయముపై మచ్చములు కడుసింగారమా

పొద్దువోనివాఁడవు పొలఁతులవలువలు
కొద్దిమీర మొలఁ గట్టుకొనివచ్చేవు
ముద్దుముద్దువలె నీమోవికెంపులే చాలవా
పెద్దరికపుటెరవు పెక్కువసింగారమా

కతకారివాఁడవు కాంతలపువ్వు దండలు
ఇతవై మెడవేసుక యెలయించేవు
తతి నన్నుఁ బొందితివి దగ్గరి శ్రీవేంకటేశ
రతులసదమదము రాఁపులసింగారమా 

Watch for audio - https://youtu.be/Ixq2eMPzTjE 

నమ్మిన దిదివో నాపితురార్జిత - Nammina Didivo

నమ్మిన దిదివో నాపితురార్జిత
మిమ్మహిఁ జూడరో యిది మీదిగాదు

నలినదళాక్షుని నామాంకితమే
నిలువున బాఁతిన నిధానము
కలకాలమిదే గాదెలకొలుచులు
నలుగడ నివియే నాలుక రుచులు

శ్రీపతిరూపమే చింతించు తలఁపే
పైపై మాయింటి భాగ్యములు
పూఁపలమిత్రులుఁబుత్రాదులివి
వైపగు మాకిదె వ్యవసాయములు

శ్రీ వేంకటపతి సేవిది యొకటే
భావించు నాయుష్యభౌష్యములు
కైవల్యపదమిదె కాయజసుఖమిదె
సావధానముల సంసార మిది (దే?)

Watch for audio - https://youtu.be/RBUX4Rhjl5s 

ప్రియురాలతోనేల బీరాలు - Priyuralitho Nela Beeralu

ప్రియురాలతోనేల బీరాలు
జయమంది రాకాసుల సాదించరాదా

చిగురుమోవిదాన చిగురుమేనిదాన
చిగురుచిత్తముదాన చెప్పేదేమి
నగుతానే సరసాన నాతోనేల పెనఁగేవు
పగవారిమీఁద నీబలువు చూపరాదా

తామెరకన్నులదాన తామెరచేతులదాన
తామెరమోముదాన తడవేదేమి
సాముసేసిసేసి మాచన్నులేల పిసికేవు
దోమటిబూతకిమీఁద తొడుకఁగరాదా

తీగెబుజములదాన తీగెకోరికలదాన
తీగెమెఱుఁగులదాన తెలిపేదేమి
యీగతి శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితి నీ-
జాగులు చుప్పనాతికే చల్లి చూపరాదా 

Watch for audio - https://youtu.be/0U4P2-I4Yy0 

Wednesday, December 25, 2024

ఈజీవునకు నేది - Ee Jivunaku Nedi

ఈజీవునకు నేది గడపల తనకు
నేజాతియును లేక యిట్లున్నవాఁడు

బహుదేహకవచములఁ బారవేసినవాఁడు
బహుస్వతంత్రముల నాపదనొందినాఁడు
బహుకాలముల మింగి పరవశంబైనాఁడు
బహుయోనికూపములఁ బడి వెడలినాఁడు

పెక్కుబాసలు నేర్చి పెంపు మిగిలినవాఁడు
పెక్కునామములచే బిలువఁబడినాఁడు
పెక్కుకాంతలతోడ పెక్కుపురుషులతోడ
పెక్కులాగులఁ బెనఁగి బెండుపడినాఁడు

ఉండనెన్నఁడుఁ దనకు ఊరటెన్నఁడు లేక
యెండలకు నీడలకు యెడతాఁకినాఁడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయని
యండ చేరెదననుచు నాసపడినాఁడు 

Watch for audio - https://youtu.be/EJt_aRg1Bkg 

అంతయు నీవే హరి - Antayu Neeve Hari

అంతయు నీవే హరి పుండరీకాక్ష
చెంత నాకు నీవే శ్రీరఘురామా

కులమును నీవే గోవిందుఁడా నా-
కలిమియు నీవే కరుణానిధీ,
తలఁపును నీవే ధరణీధరా ,నా-
నెలవును నీవే నీరజనాభా

తనువును నీవే దామోదరా, నా-
మనికియు నీవే మధుసూధనా
వినికియు నీవే విట్ఠలుఁడా,నా-
వెనకముందు నీవే విష్ణుదేవుఁడా

పుట్టుగు నీవే పురుషోత్తమా కొన
నట్ట నడుము నీవే నారాయణా,
యిట్టె శ్రీవేంకటేశ్వరుఁడా నాకు
నెట్టన గతి యింక నీవే నీవే 

Watch for audio - https://youtu.be/lafDBo9J2DI 

ఇదె శిరసుమాణిక్య - Ide Sirassu Manikya

ఇదె శిరసుమాణిక్య మిచ్చిపంపె నీకు నాకె
అద నెఱిఁగి తెచ్చితి నవధరించవయ్యా

రామ నినుఁ బాసి నీరామ నేఁ జూడఁగ నా-
రామమున నినుఁ బాడె రామరామ యనుచు
ఆమెలుఁత సీతయని యపుడు నేఁ దెలిసి
నీముద్రవుంగరము నే నిచ్చితిని

కమలాప్తకులుఁడ నీకమలాక్షి నీపాదఁ
కమలములు దలపోసి కమలారి దూరె
నెమకి యాలేమ నే నీదేవి యని తెలిసి
అమరంగ నీసేమ మటు విన్నవించితిని

దశరథాత్మజ నీవు దశశిరునిఁ జంపి యా-
దశనున్నచెలిఁ గావు దశదిశలుఁ బొగడ
రసికుఁడ శ్రీవేంకటరఘవీరుఁడ నీవు
శశిముఖిఁ జేకొంటివి చక్కనాయఁ బనులు 

Watch for audio - https://youtu.be/OJky5LxbPAk 

ఆతనికి నీవు మేలు - Ataniki Nivu Melu

ఆతనికి నీవు మేలు ఆతఁడు నీకు మేలు
చేతులెత్తి మొక్కి ఇట్టె సేవసేయవే

మనసు లెడసినాను మంచిమాఁటలె మేలు
ననుచకుండినాను వినయమే మేలు
పెనఁగులాడినాను ప్రేమపు నవ్వులే మేలు
అనిశము పతితోడ నాఁటదానికి

కోపము గలిగినాను కొసరుఁజూపులె మేలు
తోపు నూపుడైనా సంతోసాలే  మేలు
రాఁపు లెక్కడైనా నూరకె వోరుచుటే మేలు
చేపట్టిన పతితోడ చెలియకును

వేవేలు నేరములైనా వేడుకతో నుంటే మేలు
కావరించు యొరసినా కాఁగిలే మేలు
భావించి నిన్నేలినాఁడు పట్టపుదేవులఁజేసి
శ్రీవేంకటపతి మేలు చేరీ మగువ నీకు 

Watch for audio - https://youtu.be/ALlQP6D6YOA 

ఇచ్చినవాఁడు హరి - Ichinavadu Hari

ఇచ్చినవాఁడు హరి పుచ్చుకొన్నవాఁడ నేను
చెచ్చెరఁ దగవు లింకఁ జెప్పఁగదరో

నిలిచినది జగము నిండినది భోగము
కలిగె జీవుల కొక్కకాణాచి
వలయశాసనాలు వడి నాల్గు వేదములు
చలపట్టి జాణలు చదువుకోరో

పారినవి మనసులు పట్టినది జననము
పోరు దీరెఁ గర్మముల పొలమేర
కోరికలె సాక్షులు గుట్టలు త్రిగుణములు
వూరుఁ బేరుఁ దెలుసుక వొడఁబడరో

దక్కినది ధర్మము తప్పనిది భాగ్యము
లెక్కించ నుదుటివ్రాలె లిఖితములు
యిక్కువ శ్రీవేంకటేశుఁ డిన్నిటికి మూలము
చిక్కులు వాపె నితని సేవించరో 

Watch for audio - https://youtu.be/vilsC1SL2fk 

వాడలవాడల – VADALA VADALA

వాడలవాడలవెంట వసంతము
జాడతోఁ జల్లేరు నీపై జాజర జాజర జాజ

కలికి నవ్వులే నీకుఁ గప్పుర వసంతము
వలచూపు కలువల వసంతము
కులికి మాటాడినదే కుంకుమ వసంతము
చలమునఁ జల్లె నీపై జాజర జాజర జాజ

కామిని జంకెన నీకుఁ గస్తూరివసంతము
వాముల మోహపు నీటి వసంతము
బూమెల సరసముల పుప్పొడి వసంతము
సామజగురుఁడ నీపై జాజర జాజర జాజ

అంగన యధర మిచ్చె యమృత వసంతము
సంగడి శ్రీ వేంకటేశ సతిఁ గూడితి
ముంగిటరతిచెమట ముత్తేల వసంతము
సంగతాయ నిద్దరికి జాజర జాజర జాజ 

Watch for audio - https://youtu.be/pkw3ocHEpoQ 

ఆపదలె సంపదలకాధారమై - Apadale Sampalakadharamai

ఆపదలె సంపదలకాధారమై తోఁచె
పైపైనె తమకంబె పరిణామమాయ

పురిగొన్న మదనాగ్ని పుటము దాఁకినవలన
తరుణిదేహంబు కుందణమువలెనాయ
సురుగక వియోగాగ్ని చొచ్చి వెలువడెఁ గాన
మరుజన్మమై మహామహిమఁ బొగడొందె

పొలుపైన యిరులచేఁ బూవుగట్టిన వలన
సొలయకే మేను జాజుల పొట్లమాయి
నెలకొన్న గొజ్జంగనీటఁ దడియఁగఁబట్టి
కలకంటిమేను పులు గడగినట్లాయ

అందుపైఁ దిరువేంకటాద్రీశు నిజకృపా-
నందంబు తనకు బ్రహ్మనందమాయ
పొందైన వేడుకలు పొదిగొన్న చెలువంబు-
నందమయి సౌభాగ్యమగ్గలంబాయ 

Watch for audio - https://youtu.be/lQsCAppkzAY 

అప్పనివరప్రసాది - Appani VaraPrasadi

అప్పనివరప్రసాది అన్నమయ్యా
అప్పసము మాకె కలఁ డన్నమయ్యా

అంతటికి నేలికైన ఆదినారాయణుఁ దన
యంతరంగాన నిలిపీ నన్నమయ్యా
సంతసానఁ జెలువొందె సనకసనందనాదు
లంతటివాఁడు తాళ్లపాకన్నమయ్యా

అందమైన రామానుజాచార్యమతమున
అందుకొని నిలిచినాఁ డన్నమయ్యా
విందువలె మాకును శ్రీవేంకటనాథుని నిచ్చె
అందరిలో దాళ్లపాక అన్నమయ్యా 

Watch for audio - https://youtu.be/wAgwMq-Rk-w 

గాలినే పోయఁ కలకాలము - Galine Poya Kalakalamu

గాలినే పోయఁ గలకాలము
తాలిమికిఁ గొంతయుఁ బొద్దు లేదు

అడుసు చొరనే పట్టెఁ నటునిటుఁ గాళ్ళు
గడుగుకొననే పట్టెఁ గలకాలము
ఒడలికి జీవుని కొడయఁడైనహరిఁ
దడవఁగా గొంతయుఁ బొద్దులేదు

శిరసు ముడువఁబట్టె చిక్కుదియ్యఁగఁ బట్టె
గరిమలఁ గపటాలఁ గలకాలము
తిరువేంకటగిరి దేవుఁడైన హరి
దరిచేరాఁ గొంతయుఁ బొద్దు లేదు 

Watch for audio - https://youtu.be/7vKfCdgfmkE 

చల్లనై కాయఁగదొ - Challanai Kayagado

చల్లనై కాయఁగదొ చందమామా నీ
వెల్ల(ల్లి?)గాఁ దిరువేంకటేశునెదుర
మొల్లమిగ నమృతంపు వెల్లి గొల్పుచు లోక-
మెల్ల నినుఁ గొనియాడఁగాను

పొందైన హితులు నాప్తులు రసికులును గవులు
నందమగు నునుమాటలాడ నేర్చిన ఘనులు
చిందులకు నాడేటి సీమంతినీ మణులు
చెలఁగి యిరుగడఁ గొలువఁగాను

మంగళాత్మకములగు మహితవేదాంత వే-
దాంగవిద్యలకు ప్రియమంది చేకొనుచుఁ దిరుఁ
వేంకటేశుండు గడు వేడుకలతోడఁ దిరుఁ
వీథులను విహరించఁగాను 

Watch for audio - https://youtu.be/DSbn3IfE_NQ 

చాల నొవ్వి సేయునట్టి - Chala Novvi Seyunatti

చాల నొవ్వి సేయునట్టిజన్మమేమి మరణమేమి
మాలుగలపి దొరతనంబు మాన్పు టింత చాలదా

పుడమిఁ బాపకర్మమేమి పుణ్యకర్మమేమి తనకు
కడపరానిబంధములకుఁ గారణంబులైనవి
యెడపకున్న పసిఁడిఁసంకెలేమి యినుపసంకెలేమి
మెడకుఁ దగిలియుండి యెపుడు మీఁదుచూడరానివి

కర్మియైనయేమి వికృతకర్మియైననేమి దనకు
కర్మఫలముమీఁదకాంక్ష గలుగు టింత చాలదా
మర్మ మెరిఁగి వేంకటేశుమహిమలనుచుఁ దెలిసినట్టి
నిర్మలాత్ము కిహముఁ బరము నేఁడు గలిగెఁ జాలదా 

Watch for audio - https://youtu.be/UFFjj6Vv4gI 

అన్నిటిపై నున్నట్లు - Anniti Pai nunnatlu

అన్నిటిపై నున్నట్లు హరిపై నుండదు మతి
కన్నులఁ బ్రహ్లాదువలె కనుఁగొను టరుదా

పులుగు నర్చించొకఁడు పూఁచెనాగతమెరిగి
వెలసి ఘనుఁడనంటా విఱ్ఱవీఁగీని
జలజాక్షుపాదములు సారె నర్చించేటివారు
ఇలలోనఁ బరమార్థ మెరుఁగుటయరుదా

మానివోడ నమ్మెుకఁడు మహాజలధి దాఁటి
నానార్థములు గూర్చి నటియించీని
శ్రీనాథుపాదములు చేకోనినమ్మినవాఁడు
పూని భవవార్థి దాఁటి పుణ్యమందు టరుదా

దీపమువట్టి యెుకఁడు తెగనిచీఁకటిఁ బాసి
చూపులనిన్నిటిఁ గని సుఖమందీని
చేపట్టి పరంజ్యోతి శ్రీవేంకటేశుభక్తుఁ-
డోపి ముక్తి కడగని వున్నతుఁడౌ టరుదా 

Watch for audio - https://youtu.be/8G29mwBrsZQ 

దీనుఁడ నేను దేవుఁడవు నీవు - Deenuda Nenu Devudavu Neevu

దీనుఁడ నేను దేవుఁడవు నీవు
నీ నిజమహిమే నెరపుటఁ గాకా

మతి జనన మెఱఁగ మరణం బెఱఁగను
యితవుగ నిను నిఁక నెరిఁగేనా
క్షితిఁ బుట్టించిన శ్రీపతివి నీవే
తతి నాపై దయ దలఁతువుఁ గాకా

తలఁచఁ బాపమని తలఁచఁ బుణ్యమని
తలఁపున ఇఁక నినుఁ దలఁచేనా
అలరిన నాలో యంతర్యామివి
కలుష మెడయ ననుఁ గాతువుఁ గాకా

తడవ నాహేయము తడవ నామలినము
తడయక నీ మేలు దడవేనా
విడువలేని శ్రీవేంకటవిభుఁడవు
కడదాఁకా నిఁకఁ గాతువుఁ గాకా 

Watch for audio - https://youtu.be/bhhHEJ-Mke4 

ఏదైవము శ్రీపాదనఖమునఁ - E Daivamu sripaadanakhamuna

ఏదైవము శ్రీపాదనఖమునఁ బుట్టినగంగ   
త్రిలోకపావనము చేయును త్రిపథగామిని ఆయను 
యేదైవము నాభినలినంబున జనియించినఅజుండు 
అఖిలాండంబులు సృజియింప నధిపతి ఆయను 

యేదైవమువురస్థలంబు దనకును మందిరమైనయిందిర 
మాతయయ్యె యీజగంబుల కెల్లను 
యేదైవము అవలోకన మింద్రాదిదివిజగణంబుల - 
కెల్లప్పుడును సుఖంబు లాపాదించును 

యేదైవము దేహవస్తు వని అనిమిషులందరుఁ గూడి 
శ్రీనారాయణ దేవుండని నమ్మియుండుదురు 
ఆదేవుఁడే సిరుల కనంతవరదుడు తిరువేంకట - 
గిరినాథుఁ డుభయవిభూతినాథుఁడే నానాథుఁడు 

Watch for audio -  https://youtu.be/B3FVRXASdmQ 

Saturday, December 14, 2024

సాదించరాని దొక్కటే - SadinchaRani Dokkate

సాదించరాని దొక్కటే సత్యమైన మోక్షము
సోదించితే శ్రీహరి దాసులకే సులభము

బొందితో స్వర్గమునకుఁ బొయ్యేది యరుదు గాదు
అంది యర్జునుఁ డుండఁడా అయిదేండ్లు
అందరాదు బ్రహ్మపద మదెవ్వరి కనరాదు
పొందుగా రైవతుఁడదె పోయి వుండి రాఁడా

జనులు సూర్యునొద్దకు చనరా దనఁగ రాదు
ఘనవిక్రమార్కుఁ డేఁగి కని రాఁడా
జునిఁగి మీఁదిలోకాలు చూచివచ్చే దేమి దొడ్డు
యెనలేక యయాతి యిన్నిఁ జూచి రాఁడా

విరజానది దాఁటి విష్ణుపద మంది రాను
సురలందు నరులందుఁ జూచితే నెవ్వరు లేరు
యిరవైన శ్రీవేంకటేశుని మహిమ లివి
గరిమె నితనినే కని కొల్వవలయు

Watch for audio - https://youtu.be/lR4KDTOLxVM 

సమబుద్ధే యిందరికి - Samabudde Indariki

సమబుద్ధే యిందరికి సర్వవేదసారము
సముఁడిందరికి హరి సాధన మోయయ్యా

చీమకుఁ దనజన్మము చేరి సుఖమై తోఁచు
దోమకుఁ దనజన్మము దొడ్డసుఖము
ఆమనియీఁగకు సుఖ మాజన్మమై తోఁచు
యేమిటా నెక్కువసుఖ మెవ్వరి కేదయ్యా

జంతురాసులకు నెల్లా జననము లొక్కటే
అంతటాను మరణము లవియొక్కటే
చెంత నాహారనిద్రలు స్త్రీసుఖా లొక్కటే
ఇంతటా నిందుకంటే నెవ్వ రేమి గట్టిరయ్యా

ఇందులోన నెవ్వరైనానేమి శ్రీవేంకటపతి-
నందముగాఁ దలఁచిన దది సుఖము
యెందుఁ జూచిన నీతఁ డిందరిలో నంతరాత్మ
చందముగా నెవ్వరికి స్వతంత్ర మేదయ్యా

Watch for audio - https://youtu.be/MCbPqjeKUmw 

శ్రీవేంకటేశ్వరుఁడు - SriVenkateswarudu

శ్రీవేంకటేశ్వరుఁడు శ్రీయలమేల్మంగతోడ
కోవిదుఁడై విహరించీ కోడతిరుణాళ్లు

వెల్లవిరిగా వీదుల వెన్నెలలు గాయఁగా
చల్లని పూవులవాన జడి మించఁగా
వొల్లనే సతులు దన్ను వుగ్గళించి పొగడఁగా
కొల్లలాడీ వలపలు కోడతిరుణాళ్లు

ఆటల పాటలవాఁడు అండనే వినిపించఁగా
పాటించి యారగింపులు పైపైఁ జేయఁగా
గాఁటముగ వీడెములు గందములు నందుకొంటా
కోటి భోగాలు భోగించీ కోడతిరుణాళ్లు

చేరి పన్నీరు కప్రము శిరసునఁ గులుకఁగా
వూరక యిందరు కొలువులు సేయఁగా
యీరీతి శ్రీవేంకటేశుఁడిందరుసతులఁ గూడి
కోరికలు వెదచల్లీ కోడతిరుణాళ్లు

Watch for audio - https://youtu.be/M1nigmFD36s 

నీ దిక్కే తప్పక చూచీ - Ni Dikke Tappaka Chuchi

నీ దిక్కే తప్పక చూచీ నీ విభుఁడు
మోదముతోఁ జేతు లెత్తి మొక్కు మొక్కఁగదవే

బాసికము గట్టుకొని పదరఁగ నేఁటికి
సేసలు చల్లే అప్పుడు సిగ్గు లింకానా
ఆసతోఁ బెనఁగుతాను అనుమానము దగునా
వేసరని వలపుల విఱ్ఱవీఁగ గదవే

వీడెము చే నందుకొని వింత సేయవలెనా
కూడిమాడి వుండి మరి గుట్టు సేతురా
వాడికగాఁ బొందుసేసి వావు లడుగుదురా
జోడు గూడి కౌగిటిలో సొంపుమీఱఁ గదవే

మంతనాన దక్కగొని మరఁగు వెదకుదురా
పంతము లీడేరె మరి కొసరేలా
చెంత నలమేల్మంగవు శ్రీ వేంకటేశుఁ డతఁడు
సంతోసించి నిన్ను నేలే జట్టిగొనగదవే

Watch for audio - https://youtu.be/hhHyQGMdFu8 

విత్తొకటి వెట్టఁగా - Vittokati Vettaga

విత్తొకటి వెట్టఁగా వేరొకటి మొలచునా
యెత్తి హరి నీవు నను నీడేర్తుగాక

మోహబాంధవములకు మూలంబు తనువు
వూహాపోహలకు వునికి యీ తనువు
దాహమున కాఁకటికి తగులు యీ తనువు
యీహీ వైరాగ్య మిందెట్టు గలుగు

పంచేంద్రియములకు పాదు యీ తనువు
చంచలపుటాసలకు జంట యీ తనువు
అంచె దుర్గణములకు నాకరము తనువు
యెంచి చూడ వివేక మిందెట్టు నిలుచు

యీహలోకసుఖములకు హేతువీ తనువు
బహుపుణ్యపాపాలకు ఫలము యీ తనువు
యిహమునకు శ్రీవేంకటేశ నీదాస్యమున
విహరించెఁ దనువు యిఁక వెఱపేల కలుగు

Watch for audio - https://youtu.be/nOJHEzzyeZ4 

ఆదిపురుషా అఖిలాంతరంగా - Aadi Purusha Akhilantharanga

ఆదిపురుషా అఖిలాంతరంగా
భూదేవతారమణ భోగీంద్ర శయనా

భవపాథోనిధి బాడబానల
భవజీమూత ప్రభంజనా
భవపర్వత ప్రళయ భయదనిర్ఘాత దు
ర్భవ కాలకూటభవ బహువిశ్వరూప

భవఘోరతిమిరదుర్భవకాలమార్తాండ
భవభద్ర మాతంగ పంచానన
భవ కమలభవ మాధవరూప శేషాద్రి
భవన వేంకటనాథ భవరోగవైద్య 

English Lyrics - 
--------------------------- 
Adipurusha Akhilantaranga
Bhudevataramana Bhogindrasayana  

Bhavapathonidhi badabanala
Bhavajimuta prabhamjana
Bhavaparvata pralaya bhayada nirghata du
Rbhava kalakutabhava Bahuvisvarupa  

Bhavaghoratimiradurbhava kaalamartanda
Bhavabhadra matamga panchanana
Bhava kamalabhava Madhavarupa Seshadri
Bhavana Venkatanatha bhavarogavaidya 

భావామృతం
శ్రీవేంకటేశ్వరా! నీవు ఆది పురుషుడవు. (నీముందు ఎవ్వరూ లేరు). ఆ సమస్త జీవుల అంతరంగములలో నీవు ఆత్మరూపంలో నేలకొని యున్నావు. అది వరాహమూర్తిగా భూకాంతను చేబట్టిన నాథుడవు. అంతేకాదు నీవు పన్నగేంద్రుడైన ఆదిశేషునిపై పవళించియుండు విష్ణుమూర్తివి.
ఓ ప్రభూ! ఈ భవసాగరమున (సంసార సాగరమున) నీవు ఘోరమైన బడబానలము దహించివేతువు. అద్భుత ప్రభంజనం (ఝంఝామారుతం) వలె ఈ సంసార కారు మేఘాలను పటాపంచలు చేసివేతువు. భవ పర్వతములను సమూలంగా నిర్మూలించగల నిర్ఘాతము వంటివాడు. (అనగా పిడుగువలె పొడి పొడి చేయగలవాడు). కాలకూట విషమువలె భవమును రూపుమాపు మహానుభావుడవు. విశ్వరూపుడై అనంతరూపుడై అనేకవిధముల నుండువాడు.
సంసారమును ఘోరాంధకారమునకు ఈ స్వామి ప్రచండ మార్తాండుడు, (జ్వలించు సూర్యుడు). సంసారమను భద్ర గజమును చీల్చి చెండాడు మృగరాజు (సింహము). సంసార కమలంలో నుంచి పుట్టిన బ్రహ్మ రూపుడు కూడా ఈ ప్రభువే. లక్ష్మీకాంతుడైన శ్రీమన్నారాయణుడు ఈయనే. శేషాచలమనే దివ్యసదనంలో శ్రీవేంకటేశ్వరుని రూపంలో ఈ భవరోగాన్ని సమూలంగా రూపుమాపే వైద్య శిఖామణి ఈ దేవదేవుడే.
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు) 

Watch for audio - https://youtu.be/EA7SnorxHRE