Thursday, June 29, 2023

ఎవ్వరి మెచ్చఁ దగవు - Yevvari Meccha Dagavu

ఎవ్వరి మెచ్చఁ దగవు యిద్దరిలో రామరామ
రవ్వగా సురలు విచారముసేసే రిందుకే

దశరథు యజ్ఞములో తగ నీవు జనియింప
దశకంఠుమేనఁ బుట్టె దావాగ్ని
వశమైన శాంతితో వర్ణనకెక్కితి నీవు
దశకంఠుఁ డంటి (ది) నట్టిధర్మ మందె సమసె

నెఱిఁ దొల్లి సీతకుఁగా నీవు విల్లెత్తఁగాను
చెఱకు విల్లెత్తె నీపెఁ జేరి మరుఁడు
విఱిగె నీవెత్తినట్టి విల్లయితే నెంతైన
విఱుగ కాతనివిల్లు వెసఁ బెండ్లిసేసెను

శ్రీ వేంకటాద్రిమీఁదఁ జేరి యెక్కితివి నీవు
ఆ వెలఁది నీవుర మట్టె యెక్కెను
దేవుఁడవై ఇందరిలోఁ దిరుగాడుదువు గాని
వోవల నాకైతే నీపై వున్నచోనే వున్నది 


సీతాసమేత రామ - Sita Sameta Rama

సీతాసమేత రామ శ్రీరామ
రాతి నాతిఁ జేసిన శ్రీరామ రామ

ఆదిత్యకులమునందు నవతరించిన రామ
కోదండభంజన రఘుకుల రామ
ఆదరించి విశ్వామిత్రుయాగము గాచిన రామ
వేదవేదాంతములలో వెలసిన రామ

బలిమి సుగ్రీవుని పాలి నిధానమ రామ
యిల మునుల కభయమిచ్చిన రామ
జలధి నమ్ముమొనను సాధించిన రామ
అలరు రావణదర్పహరణ రామ

లాలించి విభీషణుని లంక యేలించిన రామ
చాలి శరణాగతరక్షక రామ
మేలిమి శ్రీవేంకటాద్రిమీఁద వెలసిన రామ
తాలిమితో వెలయు ప్రతాపపు రామ 


భళి భళి రామా - Bhali Bhali Rama

భళి భళి రామా పంతపు రామా నీ -
బలిమి కెదురు లేరు భయహర రామా

విలువిద్య రామా వీరవిక్రమ రామా
తలకొన్న తాటకాంతక రామా
కొలయై ఖరుని తలగుండుగండ రామా
చలమరి సమరపు జయరామ రామా

రవికుల రామా రావణాంతక రామ
రవిసుతముఖ కపిరాజ రామ
సవరఁగాఁ గొండలచే జలధిగట్టిన రామ
జవసత్త్వసంపన్న జానకీరామా

కౌసల్యరామా కరుణానిధి రామ
భూసురవరద సంభూతరామా
వేసాలఁ బొరలే శ్రీ వేంకటాద్రి రామ
దాసులమమ్ముఁ గావఁదలకొన్న రామా