Sunday, May 21, 2023

శ్రీసతికరుణే దిక్కు - Srisatikarune Dikku

శ్రీసతికరుణే దిక్కు జీవుల కెల్లా
వాసుదేవుఁడా రమణీవశమైయుండఁగను

సీతవద్దనుండ రాముచేఁ గాకాసురునకు
నాతలఁ బ్రాణము నిల్చె నపరాధియైనాను
యేతుల రావణాసురుఁ డిటువంటివాఁడే కాఁడా
కాతరాన నొంటిఁ జిక్కి పిండతుండా లాయెను

కదిసి రుక్మిణి యుండఁగాఁ గృష్ణునిచే రుక్మికి
అదన బ్రదుకు గల్గె నతిద్రోహి యైనాను
యెదుటనే శిశుపాలుఁ డీరీతివాఁడే కాఁడా
తుద సభలో వదరి తునకలై పడెను

సిరితోడ పైనుండఁగ శ్రీనరసింహుచే దైత్య
గురుపుత్రులు నిలిచిరి క్రూరకర్ము లైనాను
పరగ శ్రీవేంకటేశుపగ గాఁడా హిరణ్యుఁడు
గరిమ నదరిపాటుగాఁగాఁ బొలిసెను 


ఉప్పవడము గావయ్యా - Vuppavadamu Gavayya

ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీఁద
గొప్పగొప్ప కన్నుల గోవిందరాజా

పవ్వళించే వీడ వచ్చి పాయనినీయలపెల్ల
మువ్వంక మేనితోడ ముచ్చట దీఱ
నవ్వేటి శ్రీసతి చూపు నాటిన చిత్తపుమేన
క్రువ్వనికలువదండై గోవిందరాజా

నిద్ధిరించే వీడ వచ్చి నిలుచున్నయలపెల్ల
ప్రొద్దువొద్దునకుఁ దీర భోగీంద్రుపై
యిద్దరు సతులు నీకు నేచిన తాళగతుల
గుద్దేటి పాదములతో గోవిందరాజా

మెండుగ మేలుకొంటివి మించిన కౌఁగిటిలోన
కొండుకపాయపుసిరి కోపించంగా
ఉండవయ్యా సుఖలీల నుడివోనిప్రియముతో
కొండలకోనేటిరాయ గోవిందరాజా 


ఇందిరారమణుఁ - Indiraramanu

ఇందిరారమణుఁ దెచ్చి యియ్యరో మాకిటువలె
పొంది యీతనిఁ బూజించ బొద్దాయనిపుడు

ధారుణి మైరావణు దండించి రాముఁదెచ్చి
నేరుపుమించిన యంజనీతనయా
ఘోరనాగపాశములఁ గొట్టివేసి యీతని
కారుణ్యమందినట్టి ఖగరాజ గరుడా

నానాదేవతలకు నరసింహుఁ గంభములో
పానిపట్టి చూపినట్టి ప్రహ్లాదుఁడా
మానవుఁడై కృష్ణమహిమల విశ్వరూపు
పూని బండినుంచుకొన్న పొటుబంట యర్జునా

శ్రీ వల్లభునకు నశేషకైంకర్యముల
శ్రీ వేంకటాద్రి వైన శేషమూరితీ
కైవసమైన యట్టి కార్తవీర్యార్జునుఁడా యీ
దేవుని నీవేళ నిట్టె తెచ్చి మాకు నియ్యరే 


ఇంకనేల సిగ్గుపడేవు - Inkanela Siggupadevu

ఇంకనేల సిగ్గువడే విద్దరు నున్నా రీడను
కొంకక నన్ను మన్నించి కూడితివి నాఁడే

కంకణాలచేత నాపె కానుక లిచ్చీ నీకు
అంకెలఁ బరాకుమాని అందుకోవయ్యా
సంకెలేక నీముందర చక్కఁగా నిలుచున్నది
పంకించక నీ మోము చూపఁగదవయ్యా

మూరెఁడు దురుమువంచి మునుకొని మొక్కీ నీకు
తేరకొనఁ జూచాకెను దీవించవయ్యా
కూరిమి గొసరి నీ కొలువులు సేసీని
సారెకును మెచ్చి మెచ్చి సంతోసించవయ్యా

వెలయ కప్రపు నోర విన్నపాలు సేసీ నీకు
లలిఁ జెవ్వులారా విని లాలించవయ్యా
అలమేల్మంగను నే నీ యాలను శ్రీవేంకటేశ
వలచి వచ్చినాపెను వడిఁ జేకొనవయ్యా