Saturday, April 29, 2023

చిత్తజగురుఁడవో - Cittajagurudavo

చిత్తజగురుఁడ వో శ్రీ నరసింహా
బత్తిసేసేరు మునులు పరికించవయ్యా

సకలదేవతలును జయవెట్టుచున్నారు
చకితులై దానవులు సమసి రదె
అకలంకయగు లక్ష్మి యటు నీ తొడపై నెక్కె
ప్రకటమైన నీ కోపము మానవయ్యా

తుంబురునారదాదులు దొరకొని పాడేరు
అంబుజాసనుఁ డభయమడిగీ నదె
అంబరవీధి నాడేరు యచ్చరలందరుఁ గూడి
శంబరరిపుజనక శాంతము చూపవయ్యా

హత్తి కొలిచే రదె యక్షులును గంధర్వులు
చిత్తగించు పొగడేరు సిద్ధసాధ్యులు
సత్తుగా నీ దాసులము శరణు చొచ్చితి మిదె
యిత్తల శ్రీవేంకటేశ యేలుకొనవయ్యా 


రెప్పల మరఁగదె - Reppala Maragade

రెప్పల మరఁగదె రేపును మాపును
యిప్పుడే తోఁచీనిదివో కీలు

మనసున నున్నవి మాయలన్నియును
మనసు మరచితే మాయలు మరచును
పనివడి మనసునుఁ బారఁగవిడిచిన
కనుఁగొన మాయలు కడలే వివిగో

దేహమున నున్నది తెగని లంపటము
దేహ మణఁచితేఁ దెగును లంపటము
వూహల దేహమే వోయగఁ దొడఁగిన
మోహపు మాయలు మోపుల కొలఁది

ఆతుమ నున్నాఁడు అంతరాత్మకుఁడు
ఆతుమ మరచిన నాతఁడు మరచును
యీతఁడె శ్రీవేంకటేశ్వరుఁ గొలిచిన
చేచేతనే సుఖములు సేనాసేన