Sunday, July 24, 2022

పనిగొన నేరిచితే - Panigona Nericite

పనిగొన నేరిచితే పాపమే పుణ్యమౌను
నినుఁ గొలిచేయట్టి నీసేవకులకు

మనసు చంచలమైనా మరి నిన్నుఁ దలఁచితే
జనులకు నిహపరసాధనమౌను
తనువు హేయమైనా తగ నిన్నుఁ గొలిచితే
పనివడి యంతలోనే పవిత్రమౌను

కర్మము బంధకమైనా కమ్మి నీసొమ్ముచేసితే-
నర్మిలి మోక్షమియ్య నాధారమౌను
మర్మము కోరికయైనా మహి నీభక్తికెక్కితే
ధర్మములకుఁ బరమధర్మము దానౌను

జగమెల్లా మాయయైనా సరి నీకే శరణంటే
పగటున నదే తపఃఫలమౌను
అగపడి శ్రీవేంకటాధిప నన్నేలితివి
మిగులా నిహమైనా మించి పరమౌను 


Watch for Audio - https://youtu.be/8Lq8AUDMxBA

బొడ్డు తామెరలోన - Boddu Tameralona

బొడ్డు తామెరలోన గడ్డివయసు పెద్ద
బిడ్డఁ గన్నట్టివాడుఁ పిన్నవాడు

బిరుసైనదొకకొండ పెనుబాముతోఁ జుట్టి
బిరబిరనె త్రిప్పే పిన్నవాఁడు
గురుతైనదొకకొండ గొడగుగా నొకచేత
పెరికి పట్టేవాఁడు పిన్నవాఁడు

బెడిదంపు శిశుపాలు పెనుమోఁతతోగూడ
పెడచేతనే వేసెఁ బిన్నవాఁడు
పడవేసి చాణూరుఁ బట్టి యురము దొక్కి
పిడికిటనే చంపే పిన్నవాఁడు

ఎక్కడఁ జూచినఁ నింతటఁ దానై
పెక్కురూపములైన పిన్నవాఁడు
ఇక్కడఁ దిరువేంకటేశుఁడై జగమెల్ల
పిక్కిటిల్లినవాడు పిన్నవాఁడు


Watch for Audio - https://youtu.be/xtxrNwn00t8

వీదులవీదులనెల్ల - Vidula Vidula Nella

వీదులవీదులనెల్ల వీఁడె కృష్ణుఁడు
ఆదిగొని మెరసీని అల్లవాఁడె కృష్ణుఁడు

చక్కిలాలు నురుగులు జలజలరాలఁగాను
వుక్కుమీరికొట్టీఁ గృష్ణుఁడుట్లెల్లాను
పక్కన గొపికలెల్లాఁ బట్టఁగా, వారిపాదాలు
దోక్కి పెండ్లాడఁ జూచీ దొమ్మికాఁడు కృష్ణుఁడు

పాలుఁ బెరుగులు పెద్దపరఁటులవెన్నలు
సోలిగోన్నదొంతులలో జుఱ్ఱుకొనీని
కోలలగోపాలులకు గొబ్బన వంచిపోసీని
చాలునన్నా మానఁడు జాణకాఁడు కృష్ణుఁడు

చారపప్పుఁదేనేలు సనఁగలు చెఱకులు
అరగించి గోపాలులతో నట్టుగలెక్కి
కోరి యలమేలుమంగఁ గూడి శ్రీవేంకటేశుఁడై
మేరమీరి యేగీ వీఁడే మేటికాఁడు కృష్ణుఁడు 


Watch for Audio - https://youtu.be/zrisnFW7CiY 

ఇందే కలిగె నీకు - Inde Kalige Neeku

ఇందే కలిగె నీకు నిన్ని భోగాలు
అందముగాఁ జిత్తగించు మౌభళేశ్వరా

భవనాశి యే రనేటి పడఁతి యాలు నీకు
యివల నెదురుగొండ లీపెచన్నులు
జవళి నీపెకౌఁగిలి సరినుండే పెద్దగుహ
యవధరించఁగదయ్య అవుభళేశ్వరా

నీడదిరుగని మేరువు నెలఁత కంబుకంఠము
ఆడనే నిచ్చవానలు ఆపె చెమట
వాడనియట్టి శృంగారవనము యీ జవ్వనము
ఆడుకో నీకుఁ జెల్లె నవుభళేశ్వరా

వున్నతి యిందిరపొందు యోగానందము నీకు
కన్నుల కాపె చిత్తము గద్దెరాయి
తిన్నని మోవి నీకు తేనెల యారగింపు
అన్నిటా శ్రీవేంకటాద్రి యవుభళేశా 


Watch for Audio - https://youtu.be/aKi2ESAQXls

నీమహిమది యెంత - Ni Mahimadiyenta

నీమహి మది యెంత నీవు చేసే చేఁతలెంత
దీమసపు నీమాయలు తెలియరాదయ్యా

నీపాదతీర్థము నెత్తి మోచె నొకఁడు
పూఁపకొడుకై యొకఁడు బొడ్డునఁ బుట్టె
యేపున నింతటివారి కెక్కుడైన దైవమవు
మోపుచు ధర్మరాజుకు మొక్కుటెట్టయ్యా

నీలీల జగమెల్లా నిండియున్నదొకవంకఁ
వోలి నీలో లోకాలున్నవొకవంక
యేలీలఁ జూచినాను యింతటి దైవమవు
బాలుఁడవై రేపల్లెలోఁ బారాడితివెట్టయ్యా

శ్రీసతికి మగఁడవు భూసతికి మగఁడవు
యీసరుస శ్రీవేంకటేశుఁడవు
రాసికెక్కి నీవింతటి రాజసపుదైవమవు
దాసులము మా కెట్ల దక్కితివయ్యా 


Watch for Audio - https://youtu.be/UdrEvL8ePTI

Sunday, July 10, 2022

హరియే సకలక్రియలై - Hariye Sakalakriyalai

హరియే సకలక్రియలై తృప్తి యిచ్చుఁగాక
యెరవులవారి చేఁతలెందాఁకా వచ్చీని

నరులకు నరులే పరలోకక్రియలు
సిరిమోహాచారాలఁ జేతురు గాక
తరుపాషాణపశుతతుల కెవ్వరు సేసే-
రరయఁగ భ్రమ గాక అవి పస్తులున్నవా

కొడుకులుగలవారు కోరి పితృముఖమున
కుడుపులు దమవారిఁ గూర్చి పెట్టఁగా
అడరి శ్రీహరియే అన్నియుఁ దాఁ జేకొని
తడవి వారిఁ గొంత దయఁజూచుఁ గాక

తారేడ వారేడ దైవము శ్రీవేంకటేశుఁ-
డారయ నంతరాత్ముఁ డని తెలిసి
ధారతో యాతనియాజ్ఞఁ దప్ప కాదివసాన
చేరువఁ జేసేవెల్లాఁ జేయుఁడీ యాతనికి 


Watch for Audio - https://youtu.be/m9nTx7MnDyI

సేయరాని చేఁతలెల్లాఁ - Seyarani Chetalella

సేయరాని చేఁతలెల్లాఁ జేసితి నేను నీ-
గా(కా?)యగంటివాఁడ నేను గతిచూపవయ్యా

శరణాగతులఁ గూడి జ్ఞానము దొంగిలినాఁడ
అరిది నీ కర్మపుటానాజ్ఞలు మీరినవాఁడ
సరిఁ బ్రపంచకులముజాడ వాసినవాఁడ
ధరణి నీతప్పులకు దండన యేదయ్యా

బహుసంసారములెల్లఁ బంచలఁ దోసినవాఁడ
సహజపింద్రియముల జారినవాఁడ
మహి నాపుట్టుగులకే మరి బొమ్మఁబెట్టినాఁడ
విహిత మిందుకు నేది విధి చెప్పవయ్యా

గురుమంత్రమునకుఁ గొండెము చెప్పినవాఁడ
పరకాంతఁగూడే లోకభయము మానినవాఁడ
సిరుల మించినయట్టి శ్రీవేంకటేశ నిన్ను
మరిగి శరణంటిని మన్నించవయ్యా 


Watch for Audio - https://youtu.be/97akxHPFH64

మీ యిద్దరి విభవాలు - Mi Iddari Vibhavalu

మీ యిద్దరి విభవాలు మేము చూడవలదా
యీయెడ మమ్ము మన్నించి యింత సేయవయ్యా

తలమోఁచి యెవ్వరైనఁ దమవారయ్యిన వారిఁ
బిలువక తాము దామే పెండ్లాడేరా
అలరి శ్రీవేంకటేశ ఆడకు మమ్ము రప్పించి
వలసినట్టు గరుడధ్వజమెత్తవయ్యా

చెంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైన
అందముగ నేఁగుఁబెండ్లికంగవించేరా
అందపు శ్రీవేంకటేశ ఆడకు మమ్ము రప్పించి
విందులతోనిట్టే తిరువీదులేఁగవయ్యా

పేరుకొని తమవద్దఁ బేరటాండ్లు పాడఁగాను
సారెకుఁ బెండ్లాడకున్న సంతసమౌనా
యీరీతి శ్రీవేంకటేశ యిద్దరు మమ్ము రప్పించి
ఆరితేరి బువ్వములు అవధరించివ (ర?) య్యా 


Watch for Audio - https://youtu.be/bPsPRc5nksA

ఎన్నైనాఁ గలవు - Ennaina Galavu

ఎన్నైనాఁ గలవు పను లెక్కడ చూచినా నీకు
కన్నుల మాదిక్కు చూచి కరుణించవయ్యా

వెలఁదిమాటలు నీకు విన్నపము సేసితిమి
అలరి మారుత్తరము లానతీవయ్యా
తలఁపు దెలిసి నీకు తనమారు మొక్కుమనె
చెలఁగి ముమ్మాటికిని చేకొనవయ్యా

లేమ నీ కంపినయట్టిలేక లిదె తెచ్చితిమి
మేమరుఁ జదువుకొంటి వేమనేవయ్యా
ప్రేమతోఁ దనకుఁదాను ప్రియములు చెప్పుమనె
మా మనవి చిత్తగించి మన్నించవయ్యా

అలమేలుమంగ గురు తదె నీకుఁ జూపితిమి
కలసి లోన నల్లదె కైకొనవయ్యా
యెలమి శ్రీవేంకటేశ యిటువచ్చి కూడితివి
తలఁపు లెల్లా నీడేరె తగులై యుండవయ్యా 


Watch for Audio - https://youtu.be/0t3fsGmMLa4

ఇంతయు నీమాయ - Intayu Nimaya

ఇంతయు నీమాయమయ మేగతిఁ దెలియఁగ వచ్చును
దొంతిఁబెట్టిన కుండలు తొడరిన జన్నములు

కలలోపలి సంభోగము ఘనమగు సంపద లిన్నియు
వలలోపలి నిడిపరులు వన్నెల విభవములు
తలఁపునఁ గలిగియు నిందునే తగులకపో దెవ్వరికిని
తెలిసినఁ దెలియదు యిదివో దేవరహస్యంబు

అద్దములోపలి నీడలు అందరి దేహపురూపులు
చద్దికి వండిన వంటలు జంటఁగర్మములు
పొద్దొకవిధమయి తోఁచును భువి నజ్ఞానాంబుధిలో-
నద్దిన దిది దెలియఁగరా దంబుదముల మెఱుఁగు

మనసునఁ దాగినపా లివి మదిఁగల కోరిక లిన్నియు
యినుమున నిగిరిననీళ్లు యిల నాహారములు
పనివడి శ్రీవేంకటగిరిపతి నీదాసు లివిన్నియు
కని మని విడిచిన మనుజుల కాయపు మర్మములు 


Watch for Audio - https://youtu.be/u5HnLQAs4fM

ఏమయ్య కరుణించేది - Emayya Karuninchedi

ఏమయ్య కరుణించేది యిఁక నెన్నఁడు
చేముట్టి సరసమాడి చెక్కునొక్కరాదా

చిప్పిలుఁగాఁకలతోడి సిగ్గులు నీపైఁ జల్లీ
కప్పుర మియ్యగఁరాదా కలికికిని
రెప్పలెత్తుఁజూపులతో రేసుల నిన్నుఁ గొసరీ
దప్పికి మోవియ్యరాదా తరుణికిని

కొలకొలనవ్వులతో కూరిమి నీపై వేసీ
పిలిచి చేకొనరాదా ప్రియురాలిని
తొలఁకునాసలతోడ దూరీ నిన్ను సారెకు
అలమి చనవీరాదా అంగనకును

కందువఁ జన్నులు మోపి కళలు నీపై రేఁచీ
అంది కాఁగిలించరాదా అతివను
చెందెను బలిమిఁ బట్టి శ్రీవేంకటేశ్వర నిన్ను
అంది విడెమియ్యరాదా అలివేణికి 


English Lyrics - 
Emayya karuninchedi yika nennadu
Chemutti sarasamaadi chekkunokkarada 

Chippulugakalathodi siggulu nipai jalli
Kappura miyyagarada kalikikini
Reppalettujupulato resula ninnu gosari
Dappiki moviyyarada tarunikini 

Kolakolanavvulato kurimi neepai vesi
Pilichi chekonarada priyuralini
Tholakunasalatoda duri ninnu sareku
Alami chanavirada anganakunu 

Kanduva jannulu mopi kalalu nipai rechi
Andhi kagilincharada athivanu
Chendenu balimi batti SriVenkateswara ninnu
Andi videmiyyarada aliveniki 


Watch for Audio - https://youtu.be/aLbhuPUBELU

వద్దు వద్దమ్మా - Vaddu Vaddamma

వద్దు వద్దమ్మా యింతవాదు లాతనితోడుత
పొద్దువోనిసుద్దులెల్లా పోగులై నిలిచెను

కోరికలు దఱచైతే కోపములు దఱచౌను
మారుకొంటే మీఁదమీఁద మంకువట్టును
సారె సారెఁ బతినేల సాదించేవే నీమీఁది-
పేరడివలపు పెక్కుప్రియురాండ్లఁ దెచ్చెను

చెనకులు గడునైతే చిమ్మిరేఁగుఁ దిట్లెల్లా
పెనఁగఁబోతే నట్టే బిరుదెక్కును
కినిసి యీతనినేల కెరలి తిట్టేవే నీపై
మనసే పిక్కటిల్లి యీమగువలఁ దెచ్చెను

నయములు మించితేను నగవులు జాలువారు
నియతి నలమేల్మంగ నిన్నుఁ గూడఁగా
దయవెట్టె శ్రీవేంకటోత్తముఁడు యింతేలే సిగ్గు
ప్రియము నీమీఁదిదే యీపేరటాండ్లఁ దెచ్చెను 


English Lyrics - 
Vaddu vaddammA yiMtavAdu lAtanitODuta
PodduvOni suddulellA pOgulai nilichenu

Korikalu daRachaitE kOpamulu daRachaunu
MarukoMTE mI.rdamI.rda maMkuvaTTunu
Sare sAre.r batinEla sAdiMchEvE nImI.rdi-
PeraDivalapu pekkupriyurAMDla.r dechchenu

Chenakulu gaDunaitE chimmirE.rgu.r diTlellA
Pena.rga.rbOtE naTTE birudekkunu
Kinisi yItaninEla kerali tiTTEvE nIpai
ManasE pikkaTilli yImaguvala.r dechchenu

Nayamulu miMchitEnu nagavulu jAluvAru
Niyati nalamElmaMga ninnu.r gUDa.rgA
DayaveTTe SrIvEMkaTOttamu.rDu yiMtElE siggu
Priyamu nImI.rdidE yIpEraTAMDla.r dechchenu 


Watch for Audio - https://youtu.be/0XUpTPrXNEo