దేవుఁడు దేవియు నదె తెరదియ్యరె
పూవులదండలు దీసి పువ్వులియ్యరె
కన్నుల నిద్దురదేర గక్కన మేలుకొని
వున్నతి మొకాలు చూచే రొకరొకరు
పన్నీ రందియ్యరె పావడలు నందియ్యరె
గన్ననఁ గాళాంజి దగ్గరఁ బట్టరే
నగవులు నగుకొంటా నంటున లేచి కూచిండి
వొగిఁ గురులు దిద్దే రొకరొకరు
తగ నద్దాలు చూపరె తతితో బాగాలియ్యరె
వొగరుదేరఁ గస్తూరి వుండ లియ్యరే
బిగ్గెఁ గాఁగిలించుకొంటా ప్రియములె ఆడుకొంటా
వొగ్గిరి రతులకును వొకరొకరు
అగ్గమై శ్రీవెంకటేశుఁ డలమేలుమంగాఁ గూడి
వెగ్గళించే రలపార విసరరే యిపుడు
Watch for Audio - https://youtu.be/WjkDN_N_JdI