Saturday, January 29, 2022

ఏల చెప్పేవు నీసుద్దులు - Ela Cheppevu Nisuddulu

ఏల చెప్పేవు నీసుద్దులు యెందాఁకా మాతోను
పాలుమాలకింతలోనే బమ్మచారివైతివి

ఎలమి గొల్లెతలను యిన్నాళ్ళు పొంది పొంది
తొలఁగి మధురలోన దొరవైతివి
కొలఁది ఆవులఁగాచి గొల్లవాఁడవై యుండి
వలవంత నేఁడు రాచవాఁడవైతివి

వేడుకలకింటింట వెన్నదొంగిలి నేఁడు
ఆడ ద్వారకలో సోమయాజివైతివి
వోడక రుక్మిణీదేవినూరకే యెత్తుకవచ్చి
పాడితోనగ్రపూజకు పాత్రుఁడవైతివి

రక్కసుల కాఁపురాలు రచ్చలకెక్కఁ జెరిచి
పెక్కుధర్మాలు నిలిపి పెద్దవైతివి
చిక్కువాసి నన్నుఁగూడి శ్రీ వేంకటాద్రి మీఁద
దిక్కుల నిందరిపాలి దేవరవునైతివి

Watch for Audio - https://youtu.be/25-7ngqDbS8

ఆత డెవ్వాడు చూపరే - Atadevvadu Chupare

ఆత డెవ్వాడు చూపరే అమ్మలాల
ఏతుల నాడేటిక్రిష్ణుఁ డీతఁడే కాఁడుగదా

కందువ దేవకి బిడ్డఁగనెనట నడురేయి
అంది యశోదకుఁ గొడుకైనాఁడట
సందడించి పూతకిచంటిపాలుఁ దాగెనట
మందల ఆవులఁ గాచి మలసెనట

మంచిబండి దన్నెనట మద్దులు విరిచెనట
ఇంచుకంతవేలఁ గొండయెత్తినాఁడట
మంచాలపై గొల్లెతలమానాలు చేకొనెనట
మించులఁ బిల్లగోవివట్టి మెరసెనట

కాళింగుని మెట్టెనట కంసుఁ బొరిగొనెనట
పాలించి సురలఁ జేపట్టెనట
యీలీల శ్రీవేంకటాద్రి నిరవైనదేవుఁడట
యేలెనట పదారువేలింతుల నిందరిని 

Watch for Audio - https://youtu.be/dOtCikP9fsw

Sunday, January 2, 2022

చూడఁజూడ మాణిక్యాలు - Chooda chooda Maanikyalu

చూడఁజూడ మాణిక్యాలు చుక్కలవలె నున్నవి
యీడులేని కన్నులవె యినచంద్రులు

కంటిఁగంటి వాఁడెవాఁడె ఘనమైన ముత్యాల
కంటమాలలవే పదకములు నవె
మింటి పొడవై నట్టిమించుఁ గిరీటంబదె
జంటల వెలుఁగుశంఖచక్రా లవె

మొక్కుమొక్కు వాఁడెవాఁడె ముందరనే వున్నాఁడు
చెక్కులవే నగవుతో జిగిమో మదె
పుక్కిట లోకము లవె భుజకీర్తులును నవె
చక్కనమ్మ అలమేలు జవరాలదె

ముంగైమురాలును నవె మొలకఠారును నదె
బంగారు నిగ్గులవన్నె పచ్చబట్టదె
యింగితమెరిఁగి వేంకటేశుఁడిదె కన్నులకు
ముంగిటి నిధానమైన మూలభూతమదె 

Visit for Audio - https://youtu.be/N5ywBIucHUI


హరి దగ్గరనే - Hari Daggarane

హరి దగ్గరనే వున్నాఁ డందాఁకాఁ బారనీదు
కురచలోనే మగుడు గోవిందుమాయ

చెనకి పంచేంద్రియపు చెరువు లైదింటికి
మనసనెడి దొకటి మహా ప్రవాహము
దినముఁ బారుచునుండు దిగువకు వెళ్లలేదు
తనలోనే తానిగురు దైవమాయ

తూలని పంచభూతాలతోఁట లైదింటికి
కాలమనియెడి దొక్కకాలువ వారుచునుండు
నేలాఁ దడియదు నీరూఁ దివియదు
తోలుఁదిత్తికే కొలఁది దొరకొన్న మాయ

ముట్టి పంచప్రాణముల మొలక లైదింటికి
పుట్టుగులనియేటి యేరు పొదలి పారుచునుండు
చెట్టు చెట్టుకే కొలఁది శ్రీవేంకటేశ్వరుఁడు
నట్టనడుమ నున్నాఁడు నాననీదు మాయ