Saturday, October 23, 2021

కంటి నఖిలాండ కర్త - Kanti Akhilanda kartha

కంటి నఖిలాండ కర్త నధికుని గంటి
కంటి నఘములు వీడుకొంటి - నిజమూర్తిఁ గంటి

మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి
బహువిభవముల మంటపములు గంటి
సహజనవరత్న కాంచన వేదికలు గంటి
రహి వహించిన గోపురంబులవె కంటి

పావనంబైన పాపవినాశనము గంటి
కైవశంబగు గగనగంగ గంటి
దైవికపుఁ బుణ్యతీర్థములెల్లఁ బొడగంటి
కోవిదులు గొనియాడు కోనేరిఁ గంటి

పరమ యోగీంద్రులకు భావగోచరమైన
సరిలేని పాదాంబుజములు గంటి
తిరమైన గిరి చూపు దివ్యహస్తము గంటి
తిరువేంకటాచలాధిపుఁ జూడఁగంటి 

అలిగేదె సహజము - Aligede Sahajamu

అలిగేదె సహజము ఆఁడువారికి
మలసి నీవె తిద్దుక మన్నించవయ్యా

పలుకక నే నెంత పంతాన నీతో నుండిన
తలఁపు నీపైదెకాన తప్పులేదు
చెలఁగి మందెమేళాన చెయివట్టి తీసినాను
యెలమి నీవూడిగాన కెగ్గు లేదు

మల్లాడి కోపముతోడ మంచము దిగకుండిన
తొల్లె నీకాలు దొక్కితి దోసము లేదు
పల్లదాన వెంగెమాడి పకపక నవ్వినాను
వెల్లవిరి నాపనికి వెగటు లేదు

కావరించి నిన్నుఁగూడి గర్వముతో నుండినాను
కైవసముయితిఁగాన కడమ లేదు
శ్రీ వేంకటేశ నన్ను జిత్తగించి యేలితివి
వేవేలు భోగములకు వేసట లేదు 

Monday, October 4, 2021

సేయరాని చేఁతలెల్లాఁ - Seyarani Chetalella

సేయరాని చేఁతలెల్లాఁ జేసితి నేను నీ-
గా(కా?)యగంటివాఁడ నేను గతిచూపవయ్యా

శరణాగతులఁ గూడి జ్ఞానము దొంగిలినాఁడ
అరిది నీ కర్మపుటానాజ్ఞలు మీరినవాఁడ
సరిఁ బ్రపంచకులముజాడ వాసినవాఁడ
ధరణి నీతప్పులకు దండన యేదయ్యా

బహుసంసారములెల్లఁ బంచలఁ దోసినవాఁడ
సహజపింద్రియముల జారినవాఁడ
మహి నాపుట్టుగులకే మరి బొమ్మఁబెట్టినాఁడ
విహిత మిందుకు నేది విధి చెప్పవయ్యా

గురుమంత్రమునకుఁ గొండెము చెప్పినవాఁడ
పరకాంతఁగూడే లోకభయము మానినవాఁడ
సిరుల మించినయట్టి శ్రీవేంకటేశ నిన్ను
మరిగి శరణంటిని మన్నించవయ్యా

హరియే సకలక్రియలై - Hariye Sakalakriyalai

హరియే సకలక్రియలై తృప్తి యిచ్చుఁగాక
యెరవులవారి చేఁతలెందాఁకా వచ్చీని

నరులకు నరులే పరలోకక్రియలు
సిరిమోహాచారాలఁ జేతురు గాక
తరుపాషాణపశుతతుల కెవ్వరు సేసే-
రరయఁగ భ్రమ గాక అవి పస్తులున్నవా

కొడుకులుగలవారు కోరి పితృముఖమున
కుడుపులు దమవారిఁ గూర్చి పెట్టఁగా
అడరి శ్రీహరియే అన్నియుఁ దాఁ జేకొని
తడవి వారిఁ గొంత దయఁజూచుఁ గాక

తారేడ వారేడ దైవము శ్రీవేంకటేశుఁ-
డారయ నంతరాత్ముఁ డని తెలిసి
ధారతో యాతనియాజ్ఞఁ దప్ప కాదివసాన
చేరువఁ జేసేవెల్లాఁ జేయుఁడీ యాతనికి 

Visit for Audio -   https://youtu.be/m9nTx7MnDyI